Mon Dec 23 2024 11:04:19 GMT+0000 (Coordinated Universal Time)
పాపం.. ఖాన్ భయ్యా..?
మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కు ఈసారి టిక్కెట్ ఇవ్వడం కష్టమేనంటున్నారు. ఆయన స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తారంటున్నారు.
కొందరు రాజకీయ నేతలు వేసే అడుగులు వారి పొలిటికల్ కెరీర్ పైనే ప్రభావం చూపుతాయి. ఒక్కసారి తప్పటడుగు వేస్తే ఇక వెనక్కు తీసుకోలేరు. తర్వాత కోలుకోలేరు. అన్నీ తెలిసీ కొన్నిసార్లు క్షణికావేశంలోనూ, ఆ ఐదేళ్ల పాటు తమ ప్రయోజనాల కోసం చేసిన తప్పులు అధికారానికి దూరం చేస్తాయి. అలాంటి వారిలో జలీల్ ఖాన్ ఒకరు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి జలీల్ ఖాన్ రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో కాంగ్రెస్ నుంచి 2014లో వైసీపీ నుంచి ఆయన విజయం సాధించారు.
రెండుసార్లు...
గెలిచిన రెండుసార్లు ఆయన తనకు టిక్కెట్ ఇచ్చిన పార్టీపై వ్యతిరేకతను చాటుకున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇంత వరకూ గెలవలేదని తెలుసు. టీడీపీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ముందుగా తన సీటు గల్లంతవుతుందని తెలుసు. అయినా 2014లో వైసీపీ నుంచి గెలిచిన జలీల్ ఖాన్ స్వప్రయోజనాల కోసం టీడీపీ చెంత చేరారు. అంతే ఫినిష్.. అదే చివరి ఎన్నిక అయింది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కుతుందో? లేదో? తేలీదు. సొంత పార్టీలోనే అనేక మంది నేతలు నియోజవకర్గంలో పుట్టుకొస్తున్నారు. తనను వెనక్కు నెట్టేస్తున్నారు. దీంతో జలీల్ ఖాన్ పరిస్థితి ఎటుకాకుండా తయారయిందంటున్నారు.
టీడీపీలో చేరినా...
2014లో వైసీపీ నుంచి గెలిచిన జలీల్ ఖాన్ టీడీపీలో చేరారు. పోనీ టీడీపీలో మంత్రి పదవి దక్కిందా? అంటే అదీ లేదు. అదే వైసీపీలో కొనసాగి ఉంటే 2019 ఎన్నికల్లో మంత్రి అయి ఉండేవారంటున్నారు. అదే నియోజకవర్గం నుంచి గెలిచిన వెల్లంపల్లి శ్రీనివాస్ జగన్ తొలి మంత్రి వర్గంలోనే చోటు దక్కించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా తన కుమార్తెను టీడీపీ నుంచి బరిలోకి దింపారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఏ పదవి లేకుండానే ఆయన ఐదేళ్లు గడపాల్సి వచ్చింది.
పొత్తు కుదిరితే...
ఇక 2024 ఎన్నికల్లో జలీల్ ఖాన్ కు గాని, ఆయన కుటుంబానికి పశ్చిమ నియోజకవర్గం టీడీపీ టిక్కెట్ వస్తుందా? అంటే చెప్పలేం. జనసేన, బీజేపీతో పొత్తు ఉంటే ఆ సీటు టీడీపీ వాటికే వదిలేయడం గ్యారంటీ. పొత్తు లేకపోయినా సీటు గ్యారంటీ అని చెప్పలేం. ఈ సీటుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని కన్నేశారంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. బుద్దా వెంకన్న సయితం తాను పోటీ చేస్తానని ప్రకటించారు. బీసీలకు ఇవ్వాని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జలీల్ ఖాన్ పొలిటికల్ కెరీర్ ఇక ఫినిష్ అయినట్లేనా? అన్న సందేహం ఆయన అనుచరుల్లోనూ కలుగుతుంది. మరి జలీల్ భాయ్ చేసిన ఒకసారి వేసిన రాంగ్ స్టెప్ తో ఇంకెంత కాలం పదవులకు దూరంగా ఉంటారన్నది వేచి చూడాలి.
Next Story