Sat Dec 28 2024 12:06:30 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ సేఫ్... అలా కలసి వస్తున్నాయంతే..!
మునుగోడు ఉప ఎన్నిక ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో తెలియదు కాని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం సేఫ్ జోన్ లో ఉన్నారు
మునుగోడు ఉప ఎన్నిక ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో తెలియదు కాని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మాత్రం ఇబ్బందికరంగా మారనున్నాయి. అయితే అది నిన్నటి మాట. వరసగా జరుగుతున్న సంఘటనలు రేవంత్ కు కలిసి వస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ పదవి నుంచి రేవంత్ రెడ్డిని దించాలని అనేక రకాలుగా అనేక మంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. కొందరు పార్టీని విడిచి వెళుతున్నారు. మరికొందరు పార్టీలోనే ఉండి బహిరంగ విమర్శలు చేస్తున్నారు. అయినా ఏమీ చేయలేరు. అది కాంగ్రెస్ పార్టీ కదా.. ప్రజాస్వామ్యం పాళ్లు ఎక్కువ. అందుకే ఎవరు ఏం మాట్లాడినా ఎవరిపై చర్యలు తీసుకోలేదు.
బహిరంగ విమర్శలు...
మొన్న మర్రి శశిధర్ రెడ్డి రేవంత్ పై విమర్శలు చేయగా, నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని విడిచి వెళ్లారు. ఎమ్మెల్యే పార్టీకి, పదవికి రాజీనామా చేసి వెళ్లారు. ఆయన రాజీనామా చేసిన స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. మునుగోడులో ఎలాగైనా కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని ప్రతి ఒక్క కాంగ్రెస్ నేత అనుకోవాలి. సాధారణ ఎన్నికలకు ముందు వచ్చిన ఈ ఎన్నికలో విజయం సాధిస్తే మరింత హైప్ దొరుకుతుంది. కానీ కొందరు ఆదిలోనే కాడిని వదిలేశారు. మరికొందరు శల్యసారథ్యం చేస్తున్నారు. దీంతో రేవంత్ తో పాటు ఆయనతో పాటు ఉన్న నేతలు మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను గెలిపించుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నారు.
పీసీసీ చీఫ్ పదవి నుంచి...
కొంతకాలం క్రితం జరిగిన హుజారాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్ దక్కలేదు. దానిపై నేతలందరూ ఫైర్ అయ్యారు. చివరి నిమిషంలో అభ్యర్థిని ఖరారు చేశారని, ఉప ఎన్నికను రేవంత్ సీరియస్ గా తీసుకోలేదని హైకమాండ్ కు పితూరీలు చెప్పేశారు. దీంతో కొంత నమ్మిన పార్టీ హైకమాండ్ వివరణ కోరింది. అయితే ఈసారి మునుగోడు ఉప ఎన్నికలో అందరికంటే ముందుగానే అభ్యర్థిని ఎంపిక చేశారు. బలమైన నేతనే అభ్యర్థిగా పోటీకి దింపారు. అక్కడ కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఉంది. మునుగోడులో గెలుపోటముల బాధ్యతలను కూడా మళ్లీ రేవంత్ రెడ్డిపైనే నేతలు నెట్టేశారు. పీసీసీ చీఫ్ గా ఉప ఎన్నికల్లో గెలిపించలేని నేత సాధారణ ఎన్నికల్లో పార్టీని ఎలా ముందుకు తీసుకెళతారన్న ప్రశ్నలు వేసేందుకు నేతలు రెడీగా ఉన్నారు.
కోమటిరెడ్డి ఆడియో లీకుతో...
అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూపంలో రేవంత్ కు మంచే జరిగిందని అంటున్నారు. కోమటిరెడ్డి ఆడియో లీకు ఇప్పుడు వైరల్ గా మారింది. తాజాగా వీడియో కూడా బయటకు వచ్చింది. పార్టీలోనూ చర్చగా మారింది. రేవంత్ తో పాటు కొందరు నేతలు మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తుండగా ఇలా పార్టీలోనే ఉండి కాంగ్రెస్ ను ఓడించాలని, ఓడిపోతే తాను పీసీసీ చీఫ్ అవుతానని చెప్పడం ఇప్పుడు రేవంత్ కు కలసి వచ్చేదిలా ఉంది. మునుగోడు ఉప ఎన్నికలో ఫలితం ఎలా ఉన్నా ఇప్పుడు రేవంత్ మాత్రం సేఫ్ అని చెప్పక తప్పదు. ఆయన ఆధ్వర్యంలోనే పార్టీ ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయి. అలా రేవంత్ కు కలసి వచ్చేస్తున్నాయి మరి.
Next Story