Mon Dec 23 2024 13:14:16 GMT+0000 (Coordinated Universal Time)
తమిళి "సై" కేసీఆర్
గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కు ప్రభుత్వానికి మధ్య వార్ ప్రారంభమయినట్లే కనిపిస్తుంది.
గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కు ప్రభుత్వానికి మధ్య వార్ ప్రారంభమయినట్లే కనిపిస్తుంది. గవర్నర్ నేరుగా రంగంలోకి దిగారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గతంలో మాదిరి పరోక్ష విమర్శలు కాకుండా నేరుగా విమర్శలు చేయడం వెనక కారణం ఏమై ఉంటుందన్న దానిపై టీఆర్ఎస్ లో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. గవర్నర్ గా తమిళి సై తో గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వానికి మధ్య పొసగడం లేదు. ప్రధానంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక నుంచి ఇది మొదలయింది. సేవా విభాగం కింద ఎమ్మెల్సీ గా కౌశిక్ రెడ్డి పేరును తెలంగాణ కేబినెట్ ఆమోదించి గవర్నర్ క పంపితే ఆమె పెండింగ్ లో పెట్టారు. అప్పటి నుంచి ప్రగతి భవన్ కు, రాజ్‌భవన్ కు మధ్య దూరం పెరిగింది.
ఇద్దరి మధ్య...
గవర్నర్ ను అప్పటి నుంచి అసలు ప్రభుత్వం పట్టించుకోవడమే మానేసింది. గవర్నర్ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కేర్ చేయడం మానేసినట్లే కనపడుతుంది. ప్రజా సమస్యలపై ఆమె నేరుగా స్పందిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎక్కడైనా ఉంటే వెంటనే అక్కడ ప్రత్యక్షమవుతున్నారు. అలాగే ప్రజాదర్బార్ పెట్టి ప్రజలను రాజ్‌భవన్ కు రప్పించుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేశారు. అందుకే బడ్జెట్ సమావేశాలను కూడా గవర్నర్ ప్రసంగం లేకుండా ప్రభుత్వం ముగించింది. ఇలా ఇద్దరి మధ్య దూరం పెరిగింది.
నేరుగా ఆరోపణలు...
గవర్నర్ అయితే తాను ఎంత కలసి పోవాలనుకున్నా ప్రభుత్వం సహకరించడం లేదని చెబుతున్నారు. కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదని ఆమె ఆరోపణ. ప్రొటోకాల్ కూడా పాటించడం లేదని గవర్నర్ ఆరోపిస్తున్నారు. తాను ప్రభుత్వానికి పంపే రిపోర్టులపై కూడా స్పందన లేదని చెబుతున్నారు. రెస్పాన్స్ లేదు.. రెస్పక్ట్ లేదన్నది గవర్నర్ చేస్తున్న విమర్శల్లో ప్రధాన మైనది. రాజ్యాంగ బద్ధంగా నియమితులైన తనకు అధికారులు కూడా సహకరించడం లేదని ఆమె గట్టిగానే చెబుతున్నారు. తాను ఎవరికీ భయపడబోనని, తన పని తాను చేసుకుపోతానని అంటున్నారు.
తగ్గేది లేదంటున్న టీఆర్ఎస్
గవర్నర్ కేంద్ర ప్రభుత్వం ఆడించినట్లు నడుచుకుంటున్నారని టీఆర్ఎస్ ఆరోపణలు గుప్పిస్తోంది. గవర్నర్ తన పరిధి దాటి వ్యవహరిస్తున్నారని కూడా టీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. గవర్నర్ ను బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షురాలిగానే చూస్తున్నామని కూడా కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీజేపీ రాజకీయంగా బలపడే సమయంలో గవర్నర్ ముఖ్య పాత్ర పోషించడానికి సిద్ధమయ్యారన్నది టీఆర్ఎస్ నేతల ఆరోపణ. తెలంగాణపై బీజేపీ కేంద్ర నాయకత్వం కన్ను పడినప్పటి నుంచే గవర్నర్ వైఖరిలో మార్పు వచ్చిందన్నది టీఆర్ఎస్ నేతల అభిప్రాయం. మొత్తం మీద గవర్నర్, కేసీఆర్ ల మధ్య మొదలయిన వార్ ఎటువైపునకు దారితీస్తుందన్నది వేచి చూడాలి.
Next Story