Thu Jan 16 2025 20:05:56 GMT+0000 (Coordinated Universal Time)
2021 రివర్స్ డెసిషన్స్.. తాడేపల్లికే పరిమితం
జగన్ అధికారంలోకి వచ్చి 30 నెలలు కావస్తుంది. 2021 సంవత్సరం మొత్తం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారు
ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చి ముప్ఫయి నెలలు కావస్తుంది. 2021 సంవత్సరం మొత్తం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారు. ప్రజల్లోకి ఈ ఏడాది జగన్ వెళ్లింది అసలు లేదనే చెప్పాలి. కరోనా వైరస్ ప్రధాన కారణంగా చెప్పాలి. వైరస్ వ్యాప్తితో జగన్ ఏడాది మొత్తం క్యాంప్ కార్యాలయంలో ఉండి పాలన సాగించారు. అయితే జగన్ కు ఈ ఏడాది పాలనపరంగా అచ్చిరాలేదనే చెప్పాలి. రాజకీయంగా కలసి వచ్చినా పాలనపరంగా అనేక అడ్డంకులు జగన్ ఎదుర్కొన్నారు.
మూడు రాజధానుల బిల్లు....
ప్రధానంగా జగన్ మూడు రాజధానులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అమరావతిలో శాసనరాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేయాలని తలిచారు. కానీ న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే జగన్ ప్రభుత్వం దీనిని వెనక్కు తీసుకుంది. మూడు రాజధానుల బిల్లులతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లులను కూడా జగన్ వెనక్కు తీసుకుంటున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. మార్పులతో మళ్లీ బిల్లులు తెస్తామని జగన్ చెప్పినప్పటికీ జగన్ నిర్ణయాల్లో అతి పెద్దది వెనక్కు తీసుకోవడం ఈ ఏడాది జరిగింది.
అన్నీ రివర్స్...
ఇక శాసనమండలి రద్దు బిల్లును కూడా వెనక్కు తీసుకున్నారు. శాసనమండలిని రద్దు చేస్తూ అదే అసెంబ్లీలో తీర్మానం చేసిన జగన్ ఏడాదిన్నర తిరగకుండానే ఆ బిల్లును కూడా వెనక్కు తీసుకున్నారు. మండలి తనకు రాజకీయంగా ఉపయోగపడుతుందని భావించడంతో మండలి రద్దు నిర్ణయాన్ని కూడా వెనక్కు తీసుకున్నారు. ఇక పెరిగిన మద్యం ధరలను కూడా తగ్గించారు. మద్యనిషేధం కోసమే ధరలను పెంచుతున్నామని చెప్పిన ప్రభుత్వం దానిని కూడా వెనక్కు తీసుకుంది. మద్యం ధరలను తగ్గించింది.
రాజకీయంగా....
అయితే ఈ ఏడాది జరిగిన అన్ని ఎన్నికల్లో జగన్ పార్టీదే విజయం. పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, పరిషత్ ఎన్నికల్లో వన్ సైడ్ విజయాన్ని వైసీపీ సాధించింది. అంటే 2021 రాజకీయంగా కొంత జగన్ కు లాభించిందనే చెప్పాలి. బద్వేలు ఉప ఎన్నికల్లోనూ రికార్డు స్థాయి మెజారిటీని సాధించారు. రాజకీయంగా పరవాలేదు కాని పాలనాపరంగానే ఈ ఏడాది జగన్ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అన్ని నిర్ణయాలను వెనక్కు తీసుకున్నారు. జగన్ కు 2021 రివర్స్ డెసిషన్ ఇయర్ గా మిగిలిందనే చెప్పాలి.
Next Story