Tue Dec 24 2024 13:58:36 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ఇద్దరినీ నమ్మారు... నిలువునా ముంచారు
కుప్పం మున్సిపాలిటీలో ఓడిపోయినంత మాత్రాన టీడీపీ పని అయిపోయిందనుకోవడం భ్రమే అవుతుంది.
కుప్పం మున్సిపాలిటీలో ఓడిపోయినంత మాత్రాన టీడీపీ పని అయిపోయిందనుకోవడం భ్రమే అవుతుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వేరు. జనరల్ ఎన్నికలు వేరు. ప్రజల తీరు మారుతుంది. స్థానిక సంస్థలు, ఉప ఎన్నికల్లో అధికార పార్టీ వైపే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతారు. అది వైసీపీ, టీడీపీ ఎవరైనా ప్రజలకు ఒక్కటే. పవర్ లో ఉన్న పార్టీని గెలిపించుకుంటే ఎంతో కొంత తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రజలు సహజంగా అధికార పార్టీ వైపే మొగ్గు చూపుతారు. కానీ కుప్పంలో అంత దారుణంగా ఓడిపోవడమే ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.
ఏడు సార్లు గెలిచి...
కుప్పం నియోజకవర్గం ప్రజలు చంద్రబాబును ఏడు సార్లు గెలిపించుకున్నారు. కుప్పం ఎమ్మెల్యే అంటే ముప్ఫయి రెండు సంవత్సరాలుగా చంద్రబాబు అని చెప్పుకోవాలి. కానీ జనరేషన్ మారింది. వారి అభిప్రాయాలు మారుతున్నాయి. వారి ఆలోచనలు అన్ని కోణాల్లో చూస్తున్నాయి. చంద్రబాబు అది గమనించుకోలేదు. కుప్పం ఎన్నడూ తనను మోసం చేయదనే ఆయన నమ్ముతూ వచ్చారు. అంతే కాదు చంద్రబాబు నమ్మిన వారు అక్కడి ప్రజలు విశ్వాసాన్ని కోల్పోవడం కూడా కుప్పం ఓటమికి కారణాలుగా చెబుతున్నారు.
నా అనే వాళ్లు...
చంద్రబాబుకు కుప్పంలో సొంత ఇల్లు లేదు. నా అన్న వాళ్లు ఎవరూ లేరు. ఆయన ఎమ్మెల్సీ గౌరుగాని శ్రీనివాసులు, పీఏ మనోహర్ లను నమ్మారు. వారిద్దరిపైనే ఎప్పుడూ భారం పెడతారు. జనరల్ ఎన్నికల్లో కూడా ప్రచారం దగ్గర నుంచి ఆర్థిక విషయాల వరకూ వారిద్దరే చూసుకుంటారు. వారంటే చంద్రబాబుకు అంత నమ్మకం. ఎందుకంటే వారిద్దరే ఇప్పటి వరకూ కుప్పంలో చంద్రబాబుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు. కానీ 2019 ఎన్నికల నాటికే వారిద్దరిపైన కుప్పం ప్రజల్లో వ్యతిరేకత మొదలయిందని చంద్రబాబు గుర్తించలేకపోయారు.
మెజారిటీ తగ్గినప్పుడే...
ఎందుకంటే చంద్రబాబుకు పోయిన ఎన్నికల్లో మెజారిటీ తగ్గింది. వారిద్దరు చెప్పిన వివరణను నమ్మి మరోసారి మోసపోయారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. నిజానికి ముప్ఫయేళ్ల నుంచి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే వ్యక్తిగత ఓటు బ్యాంకును సమకూర్చుకుంటారు. అదే అన్ని ఎన్నికల్లోనూ కాపాడుతుంది. కానీ చంద్రబాబు తన కోసం నిలబడే వారిని ఎవరినీ ముప్ఫయి ఏళ్లుగా తయారు చేసుకోలేదని కుప్పం ఓటమిని బట్టి అర్థమవుతుంది. వారిద్దరిని నమ్మితే నట్టేట ముంచారన్నది టీడీపీ లో వినిస్తున్న టాక్.
Next Story