తెలంగాణ ఎన్నికల వేళ జగన్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ అభివృద్ధి తానే చేశానని చంద్రబాబు అబద్ధాలు చెబుతూ రికార్డు బ్రేక్ చేస్తున్నారని ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. గురువారం శ్రీకాకుళం జిల్లాలో చిలకపాలెంలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో ఫిరాయించిన ఎమ్మెలను ఓడించాలని చెబుతున్న చంద్రబాబు ఏపీలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొన్నారని పేర్కొన్నారు. జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
- శంషాబాద్ ఎయిర్ పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు తానే కట్టానని చంద్రబాబు చెబుతున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు పనులు వైఎస్ హయంలో 2005లో ప్రారంభమై... 2008లో పూర్తయ్యాయి.
- హైదరాబాద్ ఐటర్ రింగ్ రోడ్డు పనులు వైఎస్ హయాంలో 2005 డిసెంబర్ లో ప్రారభమయ్యాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా 11 కిలోమీటర్ల పీవీ నరసింహారావు ఫ్రైఓవర్ వైఎస్ పూర్తి చేశారు.
- చంద్రబాబు హయాంలో ఐటీ రంగం వృద్ధి రేటు 8 శాతం ఉంటే... వైఎస్ హయాంలో 14 శాతం ఉంది.
- చంద్రబాబు హయాంలో ఐటీలో రాష్ట్రంలో 5వ స్థానంలో ఉంటే... వైఎస్ హయాంలో 3వ స్థానానికి వెళ్లింది.
- చంద్రబాబు హయంలో 909 ఐటీ కంపెనీలు ఏర్పాటైతే... వైఎస్ హయంలో 1585 ఐటీ కంపెనీలు కొత్తగా వచ్చాయి.
- చంద్రబాబు హయాంలో 85945 ఐటీ ఉద్యోగాలు వస్తే.. వైఎస్ హయాంలో 2,64,375 ఐటీ ఉద్యోగాలు వచ్చాయి.
- చంద్రబాబు హయంలో 3,533 కోట్ల ఐటీ పెట్టుబడులు వస్తే... వైఎస్ హయాంలో 13,250 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
- చంద్రబాబు హయాంలో 5,025 కోట్ల ఐటీ ఎగుమతులు జరిగితే... వైఎస్ హయాంలో 33,482 కోట్ల ఐటీ ఎగుమతులు అయ్యాయి.
- చంద్రబాబు హయాంలో మేలు ఏమీ జరగకపోగా నష్టమే జరిగింది. ఆల్విన్ కంపెనీ, రిపబ్లిక్ ఫోర్జ్, నిజాం షుగర్స్, పాలేరు షుగర్స్, అదిలాబాద్ స్పిన్నింగ్ మిల్లులు, సిర్పూర్ పేపర్ మిల్లులు వంటి 54 ప్రభుత్వ కంపెనీలను చంద్రబాబు పప్పుబెల్లాలకు తన బినామీలకు అమ్మేశారు.
- సొంత కంపెనీ హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీ నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుది.
- కంప్యూటర్లు, సెల్ ఫోన్లు తానే కనిపెట్టానని, సత్యా నాదెళ్లకు కంప్యూటర్ నేర్పించానని, పీవీ సింధూకు బ్యాడ్మంటన్ నేర్పించానని చంద్రబాబు పిట్టలదొర కథలు చెబుతున్నారు.
- రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో కరువు తాండవిస్తుంటే ఇక్కడ పని లేనట్లుగా పక్క రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నారన్నారు.