Mon Dec 23 2024 23:20:51 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీకి సాయిరెడ్డి లాంటి నేత కావాలట
జగన్ కు విజయసాయిరెడ్డి లాంటి నేత ఉన్నారు. ఆయన ఢిల్లీలో పార్టీకి అనుకూలంగా వ్యూహాలను రచిస్తున్నారు. టీడీపీకి నేత లేరు
వైసీపీ అధినేత జగన్ కు విజయసాయిరెడ్డి లాంటి నేత ఉన్నారు. ఆయన ఢిల్లీలో పార్టీకి అనుకూలంగా వ్యూహాలను రచిస్తున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చినప్పుడు విజయసాయిరెడ్డి జగన్ కు హస్తినలో అండగా ఉన్నారు. కానీ చంద్రబాబుకు మాత్రం అలాంటి నేత కరువయ్యారు. టీడీపీలో ఆ స్థాయి ప్రభావం చూపే నేత లేకపోవడం లోటు అని అంతర్గత సంభాషణల్లో టీడీపీ నేతలు సయితం అంగీకరిస్తున్నారు.
ఢిల్లీలో పనులు...
విజయసాయిరెడ్డికి జగన్ ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను అప్పగించినా ఢిల్లీ విషయానికి వచ్చే సరికి ఆయనే సర్వం అయ్యారు. కానీ చంద్రబాబుకు సరైన నేతలేరు. ఉన్న ముగ్గురు పార్లమెంటు సభ్యులు అంతగా చొచ్చుకుపోయే మనస్తత్వం లేదు. గల్లా జయదేవ్ హైఫై నేతగా చెబుతారు. మరో ఎంపీ రామ్మోహన్ నాయుడు నియోజకవర్గంలో పట్టున్న నేత అయినా ఢిల్లీ పెద్దలకు చేరువ కాలేకపోయారు. ఇక మరో ఎంపీ కేశినేని నాని సయితం పార్టీ కంటే నియోజకవర్గం అభివృద్ధి ముఖ్యమనుకునే నేత.
నలుగురున్నా....
రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఉన్నప్పటికీ ఆయన చంద్రబాబు ఇచ్చిన పిటీషన్లు చేరవేయడమే తప్ప పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. అందుకే ఇటీవల చంద్రబాబు ఢిల్లీ టూర్ అట్టర్ ప్లాప్ అయిందంటున్నారు. గతంలో ఢిల్లీలో చంద్రబాబుకు ఎర్రన్నాయుడు, బాలయోగి వంటి నేతలు ఉండేవారు. చంద్రబాబు ఆదేశాల మేరకు వారు ఢిల్లీలో పనులు చక్క పెట్టేవారు.
ఢిల్లీలో ఒకరి కోసం....
కానీ అంతటి సామర్థ్యం కలిగిన నేతలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో లేరు. కనీసం కేంద్రమంత్రుల వద్దకు వెళ్లి సిఫార్సు చేయించుకునే పరిస్థిితి లేదు. దీంతో చంద్రబాబు ఢిల్లీకి ఒక నేత కావలెను అన్న అభిప్రాయం ఇటీవల సీనియర్ నేతల ముందు వ్యక్తం చేసినట్లు సమాచారం. భవిష్యత్ లో ఢిల్లీలో ఎక్కువ పనులున్నందున విజయసాయిరెడ్డి వంటి నేత కోసం చంద్రబాబు పార్టీలో వెదుకులాట ప్రారంభించారని చెబుతున్నారు. మరి ఆ నేత ఎవరనేది త్వరలోనే తేలుతుందట. ఈ మూడేళ్లు ఢిల్లీలోనే ఉండి పనులు చక్కపెట్టేందుకు చంద్రబాబు ఒక నేత కోసం అన్వేషిస్తున్నట్లు తెలిసింది.
Next Story