Wed Dec 25 2024 13:06:21 GMT+0000 (Coordinated Universal Time)
పీకే టీం ఏపీకి రాకపోవడానికి కారణమిదేనా?
ప్రశాంత్ కిషోర్ ఇంకా ఏపీకి రాలేదు. నవంబరు నుంచి వస్తుందని జగన్ స్వయంగా మంత్రివర్గ సమావేశంలో చెప్పినట్లు వార్తలు వచ్చాయి
ప్రశాంత్ కిషోర్ ఇంకా రంగంలోకి దిగలేదు. నవంబరు నుంచి పీకే టీం రంగంలోకి దిగుతుందని జగన్ స్వయంగా మంత్రివర్గ సమావేశంలో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈసారి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయన్న చర్చ జరుగుతుంది. గతంలో పార్టీ అధికారంలోకి లేకపోవడం, జగన్ చరిష్మా ఇవన్నీ కలసి వచ్చాయి. దీనికి తోడు ఎక్కువ మంది నియోజకవర్గాలకు కొత్త నేతలు కనపడటం వల్ల కూడా వైసీపీలో జనం కనెక్ట్ అయ్యారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలను...
కానీ ఈసారి వారే మళ్లీ బరిలోకి దిగబోతున్నారు. పెద్దయెత్తున ఎమ్మెల్యేలను మార్చే అవకాశం లేదు. పార్టీని నమ్ముకున్న వారిని పక్కన పెడితే ఆ నియోజకవర్గంలో మళ్లీ రెండు గ్రూపులను పార్టీ హైకమాండ్ ప్రోత్సహించినట్లవుతుంది. అందుకే తొలుత 70 మంది వరకూ ఎమ్మెల్యేలను జగన్ తప్పిస్తారని భావించినప్పటికీ ఆ దిశగా ఆలోచన విరమించుకున్నారని తెలిసింది. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో రెండు గ్రూపులున్నాయి. సిట్టింగ్ లకు టిక్కెట్ ఇవ్వకపోతే పార్టీ మరింత బలహీనమవుతుందని అంచనాలో ఉన్నారు.
మూడేళ్లకు ముందు....
ఇక ప్రశాంత్ కిషోర్ టీం కూడా మూడేళ్లకు ముందే రంగంలోకి దిగడం అనవసరమని భావిస్తున్నారట. ఇప్పుడు నియోజకవర్గాల్లో సర్వే చేసినా ఏం ఉపయోగం లేదని చెప్పారట. చివరి ఏడాది అయితే అభ్యర్థి ఎవరు? అసంతృప్తి ప్రజలలో ఎమ్మెల్యేపై ఎంత ఉన్నది అన్నది సర్వేల ద్వారా తెలుసుకోవచ్చని, ఇప్పటి నుంచి సర్వేలు చేయడం కూడా అనవరసరమని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడినట్లు తెలిసింది.
వెస్ట్ బెంగాల్ తరహాలోనే...
పశ్చిమ బెంగాల్ లోనూ ఏడాదిన్నర ముందుగానే సర్వేలు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించామని ఆయన చెప్పడంతో ఇప్పుడే పీకే టీంను నియోజకవర్గాల్లో తిప్పడం అనవసరమని జగన్ భావించారు. అందుకే ప్రశాంత్ కిషోర్ టీం ఏపీలోకి ఇంకా అడుగు పెట్టలేదన్న చర్చ పార్టీలో జరుగుతుంది. నవంబరు నెలలోనే రావాల్సి ఉండగా మూడేళ్ల ముందు అనవసరమని భావించి తమ ఏపీ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు సమాచారం.
Next Story