మూడు లాంతర్ల సెంటర్ లో జగన్ ఫైర్..!
పేదల అభివృద్ధి, సంక్షేమం కోసం వైఎస్ఆర్ ఒకడగు ముందుకేస్తే... ఆయన కుమారుడిగా తాను రెండడుగులు వేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం విజయనగరంలోని మూడు లాంతర్ల కూడలిలో జగన్ బహిరంగ సభ జరిగింది. లక్షలాది మంది పాల్గొన్న ఈ సభలో జగన్ మాట్లాడుతూ... తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పేద పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటామని పేర్కొన్నారు. వారి ఫీజులు ప్రభుత్వమే చెల్లిస్తుందని, చదవుకునేటప్పుడు పిల్లలు హాస్టల్ లో ఉంటే మెస్ ఛార్జీలు కూడా భరిస్తుందన్నారు. పేదల పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు వంటి పెద్ద చదువులు చదివితేనే వారి కుటుంబాలు పేదరికం నుంచి బయటకు వస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 32 శాతం మందికి చదువురాని పరిస్థితి ఉందని, ఇది మారాలని ఆకాంక్షించారు.
రివర్స్ గేర్ లో విజయనగరం...
అనేక పర్యాయాలు తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపించినా విజయనగరం అభివృద్ధి రివర్స్ గేర్ లో ఉందని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలోనే విజయనగరం అభివృద్ధి జరిగిందన్నారు. తొటపల్లి రిజర్వాయర్ ఇంకా కలగానే మిగిలిందని, ఈ ప్రాజెక్టు కోసం వైఎస్ రూ.400 కోట్లు ఖర్చు పెట్టి 90 శాతం పనులు పూర్తి చేస్తే... చంద్రబాబు రూ.3 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. విజయనగరంలో ఇంతవరకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేదని, డిగ్రీ కాలేజి లేని ఏకైక జిల్లా కేంద్రం విజయనగరమే అని అన్నారు. విజయనగరాన్ని స్మార్ట్ సిటీ చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.