Thu Dec 19 2024 13:07:40 GMT+0000 (Coordinated Universal Time)
ఆగస్టులోనే ముహూర్తం.. రెడీ
విశాఖ పరిపాలన రాజధానిగా జగన్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఆగస్టులో జగన్ విశాఖ నుంచి పాలన సాగించాలని భావిస్తున్నారు
ముఖ్యమంత్రి జగన్ తాను అనుకున్నది చేస్తాడు. వెనక్కు తగ్గడు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మాత్రమే సమయం ఉంది. దీంతో ఆయన అనేక నిర్ణయాలను ఈ రెండేళ్లలో తీసుకుంటారన్నది వాస్తవం. అందులో మూడు రాజధానులు. కర్నూలుగా న్యాయరాజధానిగా చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. మరోసారి రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా బీజేపీ అగ్రనేతల నుంచి ఆ హామీని జగన్ పొందినట్లు చెబుతున్నారు. రాష్ట్ర బీజేపీ అజెండా కూడా అదే కావడంతో అందుకు కేంద్ర నాయకుల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం.
బీజేపీ పెద్దల నుంచి....
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చే విషయంలో ఎలాంటి షరతులు విధించకపోయినా ఈ ప్రతిపాదనను మాత్రం బీజేపీ అగ్రనేతల ముందు పెట్టి ఓకే అనిపించుకున్నట్లు తెలుస్తోంది. ఇక విశాఖ పరిపాలన రాజధానిగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే నెలలో జగన్ విశాఖ నుంచి పాలన సాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అవసరమైన భవనాలను కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. జగన్ వారానికి ఐదు రోజుల పాటు విశాఖలోనే ఉండి పాలన సాగిస్తారన్న సమాచారం పార్టీ వర్గాల ద్వారా అందుతుంది.
రెండున్నరేళ్లు...
జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చి దాదాపు రెండున్నరేళ్లు గడుస్తుంది. న్యాయస్థానంలో చిక్కులు, రాజకీయపరమైన అంశాలు దీనికి అడ్డంకిగా మారాయి. విశాఖలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయరాజధాని ని ఏర్పాటు చేయాలన్నది జగన్ ప్రభుత్వం ఆలోచన. అందుకే అమారావతిలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా మూడేళ్లపాటు నెట్లుకుంటూ వచ్చారు. అమరావతి విషయంలో ఎంత ఆందోళనలు జరుగుతున్నా పెద్దగా పట్టించుకోలేదు. న్యాయస్థానంలో ఎదురైన చిక్కులతోనే ఇన్నాళ్లు ఆగారు.
శాసనసభలోనూ...
కానీ విశాఖలో అధికారికంగా పరిపాలన రాజధాని అని ప్రకటించకుండా తానే వెళ్లి అక్కడి నుంచి పాలన సాగించడం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. శాసనసభలో మరోసారి మూడు రాజధానుల బిల్లులు పెట్టేందుకు కూడా రెడీ అవుతున్నారు. ప్లీనరీలోనూ నేతలు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు సానుకూలంగా మారే అంశం ఇదే అని జగన్ భావిస్తున్నారు. అయితే ఆగస్టు నెల శ్రావణమాసం కావడం, మంచి ముహూర్తాలు ఉండటంతో విశాఖకు మకాం మార్చేందుకు జగన్ సిద్ధమవుతున్నారని తెలిసింది. అందుకు తగిన ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయని అధికార వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
Next Story