Sat Dec 21 2024 05:06:09 GMT+0000 (Coordinated Universal Time)
‘జల్సా’ మూవీ రివ్యూ
జల్సా చిత్రం ఫీల్‌గుడ్ మూవీ మాత్రం కాదు. అటువంటి దృష్టితో చూసి భంగపడకండి.
మనకు మనం చాలా నిజాయితీపరులమనే భావన ఉండడం సహజం. అయితే అది ఎంతవరకు? ఉన్నంతలో ఎంతోకొంత నిబద్ధతతో ఉండడం, సందర్భానుసారంగా మన నిజాయితీకి నిప్పంటుకోవడం చాలాసార్లు మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే మన అహం పూర్తిగా కాలిపోయి నగ్నమైన మనసు స్వచ్ఛంగా బయటపడుతుంది. అందుకు మనలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఇదే ‘జల్సా’ చిత్రంలో ప్రధానాంశం.
కటువైన యాదర్థం...
కేవలం కొన్ని గంటలక్రితమే ఒక ప్రసిద్ధ వ్యక్తిని లక్షలమంది చూస్తుండగా నిలదీసి, తానెంత కటువైన యదార్ధవాదో యావద్భారతావనికీ నిరూపించుకుంటుంది మాయా మీనన్. తదుపరి జరిగిన సంఘటనల్లో ఆ ప్రతిష్ఠను ఏ విధంగా నిలబెట్టుకుందీ, అసలు స్వచ్ఛమైన నిజాయితీ అనేది ఎక్కడుందీ అనేది చిత్రం మొత్తం పరుగెత్తే సన్నివేశాల్లో చూడొచ్చు. డబ్బెంత పాపిష్టిదో, అది ఎటువంటి మనుషుల్ని ఎలా మార్చగలదో కూడా సుస్పష్టంగా చూపిస్తుంది ఈ చిత్రం. నిజానికి ఈ చిత్రం విద్యా బాలన్, షెఫాలీ షాల నటనా వైదుష్యం. ఇద్దరూ అద్భుతమైన హావభావాలు ప్రదర్శించారు. ఇదే షెఫాలీ ఇంతకుముందు ‘జ్యూస్’ అనే షార్ట్‌ఫిల్మ్‌లో తన నిశ్శబ్దంతో మనలో ఉన్న పురుషాహంకారపు కళ్లల్లో కారం కొట్టి మరీ నిలదీసింది. నీరజ్ ఘేవాన్ అనే హైదరాబాద్ కుర్రాడి దర్శకత్వంలో వచ్చిన ఆ షార్ట్‌ఫిల్మ్ యూట్యూబ్‌లో ఉంది. చూడండి.
ఫీల్ గుడ్ మూవీ కాదు...
ఇక ముఖ్యంగా చెప్పుకోదగ్గ మరొక నటుడు సూర్య కాశీభట్ల. పుట్టుకతోనే సెరిబ్రల్ పాల్సీ వ్యాధితో ఉన్న ఈ కుర్రాడు ఇందులో కనబరిచిన నటన చాలా ఆకట్టుకుంది. మిగతావారిలో ఇన్స్పెక్టర్ మోరేగా నటించిన శ్రీకాంత్ మోహన్ యాదవ్ చక్కగా చేశాడు. కాస్త భయంగా అనిపించే సన్నివేశాలు ఉన్నాయి. అయినా తప్పకుండా చూడవలసిన చిత్రం. ఏళ్లతరబడి నమ్మకంగా పనిచేసేవారైనా, సొంతవారిలా భావించే పనివారైనా అవకాశపు ఆలంబనని ఏ విధంగా ఆసరాగా మార్చుకుని తమ సహజసిద్ధమైన గుణాన్ని కోల్పోతారో స్పష్టంగా తెలియపరిచే ఈ చిత్రం ఫీల్‌గుడ్ మూవీ మాత్రం కాదు. అటువంటి దృష్టితో చూసి భంగపడకండి.
కించిత్ నిర్వేదం..కాస్తంత భయం...
గవర్నమెంట్ ఉద్యోగుల పనితీరు గురించి పెద్దపెద్ద పోస్టులు రాసేవారు తమ స్వంత విషయాల దగ్గరకొచ్చేసరికి ఎలా మారిపోతారో మనం చూస్తూనే ఉంటాం. ఏ అపరిచితుడూ మార్చలేని కోట్లాది రూపాయల లావాదేవీలు నిత్యం రిజిస్ట్రేషన్ ఆఫీసుల నల్ల ఇంకు మరకల్లో ఇంకిపోయి కనబడకుండా దాక్కుంటున్నాయి. దీనికి ఎవరూ అతీతులు కారు. ఇలా రాస్తున్న నాతో సైతం. అందువల్ల ఈ చిత్రం ఎవరిలోనూ అభ్యంతరాలను లేవనెత్తే అవకాశం లేదు. తమను తాము గుర్తించుకునే ప్రయత్నంలో ఉండగానే సినిమా పూర్తైపోతుంది. కించిత్ నిర్వేదం, కాస్తంత భయం కలిగించే ఆలోచనాస్రవంతి ‘జల్సా’ ప్రైమ్‌లో ఉంది. కథ చెప్పలేదు. వాసన చూపించానంతే!
.......జగదీశ్ కొచ్చెర్లకోట
Next Story