Mon Dec 23 2024 16:00:09 GMT+0000 (Coordinated Universal Time)
జానారెడ్డి...నిర్ణయం మార్చుకున్నారా?
తెలంగాణ కాంగ్రెస్ లో జానారెడ్డి సీనియర్నేత. ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అప్పుడప్పుడు పార్టీ సమావేశాలకు హాజరవుతున్నారు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి సీనియర్ నేత. ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అప్పుడప్పుడు పార్టీ సమావేశాలకు గాంధీభవన్ కు హాజరవుతున్నారు తప్పించి తాను ఓటమి పాలయిన నాగార్జున సాగర్ కు పూర్తిగా దూరమయ్యారు. ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత జానారెడ్డి తాను ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన బోనని ప్రకటించారు. జానారెడ్డి వయసు 75 సంవత్సరాలు దాటడంతో ఇక రాజకీయంగా విశ్రాంతి తీసుకోవడమే మంచిదని ఆయన భావిస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలలోనూ జానారెడ్డి పోటీ చేసే అవకాశాలు మాత్రం లేవని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన పార్టీ అగ్రనాయకత్వానికి కూడా తెలియపర్చారంటున్నారు.
ఉప ఎన్నికల తర్వాత...
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఓటమి జానారెడ్డిని కుంగదీసింది. దీంతో ఆ ఎన్నికల ఫలితాల తర్వాతే రాజకీయంగా సెలవు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే తనకు పార్టీ పదవులను అందించిన కాంగ్రెస్ పార్టీకి సేవలందించడానికి మాత్రం అప్పుడప్పుడు పనిచేస్తానని చెప్పుకొచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలను పరిష్కరించడానికి పార్టీ పరిశీలకుడిగా వచ్చిన దిగ్విజయ్ సింగ్ ను కలిసి తన అభిప్రాయాన్ని జానారెడ్డి చెప్పి వెళ్లారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది కూడా జానారెడ్డి డిగ్గీరాజా దృష్టిికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి ఏమేం చర్యలు తీసుకోవాలో కూడా సూచించారని తెలిసింది.
సాగర్ లో ఇబ్బందులు...
నాగార్జునసాగర్ నుంచి జానారెడ్డి 2009, 2014 ఎన్నికల్లో గెలిచారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు. సాగర్ ను తన అడ్డాగా మార్చుకున్నారు. అలాంగి జానారెడ్డి 2018 ఎన్నికల్లో నోముల నరసింహయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం నరసింహయ్య మరణం తర్వాత 2020 జరిగిన ఉప ఎన్నికలలో జానారెడ్డి మరోసారి పోటీ చేసి నోముల భగత్ చేతిలోనూ ఓటమిపాలయ్యారు. ఈ నేపథ్యంలో జానారెడ్డి కుటుంబాన్ని సాగర్ నియోజకవర్గం తిరస్కరిస్తుందని అర్ధమయింది. రెండుసార్లు ఓటమి పాలు కావడంతో సాగర్ నియోజకవర్గం నుంచి తప్పుకోవాలని జానారెడ్డి భావిస్తున్నారని ఆయన సన్నిహితుల వద్ద చెబుతున్నారు.
కుమారుడు రఘువీర్ రెడ్డిని...
జానారెడ్డి తాను రాజకీయంగా దూరమైనా, తన కుమారుడు రఘువీర్ రెడ్డిని పోటీకి దింపాలని ఆయన భావిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికలలో నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసి వేస్ట్ అన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. సాగర్ లో మరోసారి తన కుటుంబం ఓటమి పాలు కావడాన్ని ఆయన ఊహించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం రఘువీర్ రెడ్డి సాగర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పటికీ ఆయనను మిర్యాలగూడ నుంచి పోట ీచేయించాలని భావిస్తున్నారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ కు మంచి పట్టుంది. జానారెడ్డి తన శిష్యుడు నల్లమోతు భాస్కరరావు 2014లో గెలిచారు. అనంతరం ఆయన టీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా భాస్కరరావు గెలిచారు.
వామపక్షాలతో అయితే...?
మిర్యాలగూడ సీటును ఈసారి వామపక్ష పార్టీలకు సీట్ల కేటాయింపు లో భాగంగా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిర్యాలగూడలో వామపక్ష పార్టీలకు మంచి పట్టుంది. సీపీఐ, సీపీఎంలు వచ్చే ఎన్నికల్లో పొత్తులో భాగంగా కోరుకునే స్థానాల్లో మిర్యాలగూడ ఒకటి ఉంటుంది. టీఆర్ఎస్ కు కూడా ఇవ్వక తప్పని పరిస్థితులున్నాయి. అందుకే జానారెడ్డి వామపక్ష పార్టీ అభ్యర్థిపైన సులువుగా గెలిచే అవకాశముందని లెక్కలు వేసుకుంటున్నారని తెలిసింది. తన కుమారుడు రఘువీర్ రెడ్డిని మిర్యాలగూడ నుంచి బరిలోకి దింపాలని జానారెడ్డి భావిస్తున్నారు. త్వరలో ఆయన స్వయంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో పర్యటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
Next Story