Thu Dec 19 2024 09:56:21 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ కు ఇంకా తెలియట్లేదా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలను సీరియస్ గా తీసుకోవడం లేదు. ప్రత్యర్థుల విమర్శలకు ఆయన ఊతమిస్తున్నట్లే కనిపిస్తుంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలను సీరియస్ గా తీసుకోవడం లేదనిపిస్తుంది. ప్రత్యర్థుల విమర్శలకు ఆయన ఊతమిస్తున్నట్లే కనిపిస్తుంది. పార్ట్ టైం పొలిటీషియన్ లాగానే వ్యవహరిస్తున్నారు. తనకు వీలయినప్పుడు వచ్చి హడావిడి చేయడం తప్ప పూర్తి సమయాన్ని ఆయన రాజకీయాలకు వెచ్చించలేని పరిస్థితి నెలకొంది. ముందు ఆర్భాటంగా ప్రకటన చేయడం ఆ తర్వాత వెనక్కు తగ్గడం పవన్ కు అలవాటుగా మారిందన్నది పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. ఇలాగయితే పార్టీ నేతల్లో ధైర్యం ఎలా వస్తుంది. క్యాడర్ లో జోష్ ఎలా వస్తుంది? పార్టీ ఎలా బలోపేతం అవుతుంది? అన్న ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానాలు లేవనే అనిపిస్తుంది. తాను స్వయంగా రెండు చోట్ల ఓటమి పాలయినా ఎందుకు ఆయనలో మార్పు రాలేదు? ఎందుకు తనను తాను ప్రశ్నించుకోరు?
ఎన్నికలకు ఇంకా....
ఎన్నికలకు ఇంకా కేవలం 18 నెలలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికీ పార్టీ అనేక నియోజకవర్గాల్లో బలంగా లేదు. క్యాడర్ ఉన్నా, అభిమానులు అధిక సంఖ్యలో ఉన్న నియోజకవర్గాల్లోనూ బలమైన నాయకత్వం లేదు. ఎవరినీ త్వరగా ఎదగనివ్వకపోవడం, వారు చేపట్టే కార్యక్రమాల్లో స్వేచ్ఛ నివ్వకపోవడం ఒక కారణంగా చెబుతున్నారు. జనవాణి కార్యక్రమాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. ప్రతి ఆదివారం నేరుగా జనం వద్దకు వెళ్లి వారి సమస్యలను తీసుకెళ్లి ప్రభుత్వానికి నివేదిస్తానని చెప్పారు. నాలుగైదు చోట్ల ఆ కార్యక్రమం నడిపిన తర్వాత ఆ కార్యక్రమానికి మంగళం పాడేసినట్లే కనిపిస్తుంది. దసరా పండగ రోజు బస్సుయాత్ర చేస్తానని చెప్పి మళ్లీ వాయిదా వేసుకున్నారు. దాదాపు రెండు నెలల నుంచి ఆ కార్యక్రమమే అమలుకు నోచుకోవడం లేదు. నియోజకవర్గాల సమీక్ష అన్నారు. దాని ఊసే లేదు.
అందుబాటులో ఉంటేనే...
ఆయన సినిమాలు చేసుకోవచ్చు. ఎవరూ తప్పుపట్టరు. ఆయన ప్రధాన వృత్తి అదే కాబట్టి అందులో అభ్యంతరం చెప్పడానికి కూడా ఏమీ ఉండదు. అలాగే విదేశాలకు వ్యక్తిగత పనులపై వెళ్లొచ్చు. కానీ రాజకీయం అంటే ఆషామాషీ కాదు. ఏదో ఒక్కసారి వచ్చి కనపడి నాలుగు డైలాగులు కొడితే ఓట్లు వచ్చి పడే కాలం కాదు. చప్పట్లతోనే సరిపెడతారు. జనం కూడా తమకు వెన్నంటే ఉండే నేతనే నమ్ముకుంటారు కాబట్టి పవన్ ను పెద్దగా పట్టించుకోక పోవచ్చు. జనసేన పార్టీ కార్యక్రమాలు జనంలోకి వెళ్లి, ఆయన కూడా అందుబాటులో ఉంటేనే ప్రజలు విశ్వసిస్తారు. జనసేన అని పేరు పెట్టుకుని జనంతో మమేకం కాకుండా అప్పుడప్పుడు రాజకీయాలను చేయడం ఎవరూ హర్షించరు.
ఆశయాలు మంచివే అయినా...
పవన్ కల్యాణ్ కు మంచి ఆశయాలు ఉండొచ్చు. మార్పు తేవాలన్న ఆకాంక్ష ఉండొచ్చు. ప్రజల సమస్యలన్నీ పరిష్కరించాలన్న కోరిక ఉండొచ్చు. కానీ అందుకు అధికారంలోకి రావాలి. పొత్తులతో ఎన్నాళ్లు పార్టీని బలోపేతం చేయాలనుకుంటారు? ఒంటరిగా పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశ్యం ఆయనకు ఉన్నట్లు లేదని క్యాడర్ లోనే నిరాశ మొదలయింది. ఏపీలో అన్ని పార్టీలు ప్రజల్లో ఉంటుంటే జనసేన మాత్రం ఎందుకు డీలా పడిపోయింది? అన్న ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. టీడీపీ, బీజేపీ, కమ్యునిస్టు పార్టీలు ప్రజాసమస్యలపై పోరాడుతుంటే, పవన్ మాత్రం ఇలా పాలిటిక్స్ చేయడం ఏంటన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. పవన్ కోసం ప్రజలు కాదు ఇప్పుడు క్యాడర్ ఎదురు చూపులు చూడటం అలవాటుగా మారిపోయింది. జనవాణి కార్యక్రమాన్ని ఈ నెల 15వ తేదీన విశాఖలో జరపాలని భావిస్తున్నారు. మరి చివరి నిమిషం వరకూ రద్దు కాకుండా ఉండాలని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారు.
Next Story