Fri Nov 15 2024 18:51:10 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీని పవన్ వదిలేస్తారా?..అందులో నిజమెంత?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని వదిలేసి టీడీపీ తో కలుస్తారని ప్రచారం జరుగుతుంది.
అందరూ ఊహిస్తున్నట్లు జరిగే అవకాశాలు లేవు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని వదిలేసి టీడీపీ తో కలుస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే పవన్ బీజేపీని దూరం చేసుకునే అవకాశాలు లేవు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజీపీని వదిలి పెట్టే ఆలోచన అయితే చేయరు. ఎందుకంటే మళ్లీ 2024 ఎన్నికల్లో బీజేపీయే కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్న సర్వేలు వస్తున్నాయి. బీజేపీకి పోటీ ఇచ్చే మరో పార్టీ లేదు. కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో బలహీనంగా ఉంది. యూపీఏలోని పక్షాలన్నీ కలసి కట్టుగా వచ్చి కాంగ్రెస్ తో జత కట్టే పరిస్థితి కన్పించడం లేదు.
కేంద్రంలో మరోసారి...
బీజేపీయే మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమన్న సర్వేలు నిజమవుతాయో? లేదో? చెప్పలేం కాని, దానిని పూర్తిగా మాత్రం కొట్టి పారేయలేం. 2019 ఎన్నికల్లో పవన్ బీజేపీని విభేదించారు. దానితో కలసి పోటీ చేయడానికి కూడా ఇష్టపడలేదు. బీఎస్పీ, కమ్యునిస్టులను మాత్రమే కలుపుకుని వెళ్లారు. బీజేపీని ఒంటరిగా పోటీ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీని తూలనాడారు. కేంద్రంలో మరోసారి అధికారంలోకి రాదన్న అంచనా వేశారు. కానీ అనూహ్యంగా 2014 కంటే మెరుగైన సీట్లను బీజేపీ సాధించింది. అందుకే 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే పవన్ బీజేపీతో నేరుగా పొత్తుకు సిద్ధమయ్యారు. మోదీ చరిష్మాతో పాటు తన ఇమేజ్ కలిస్తే ఏపీలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావించారు.
మరోసారి తప్పిదం....
ఇప్పుడు బీజేపీని వదిలేస్తే మరో సారి తప్పిదం చేసినట్లు అవుతుందని పవన్ భావిస్తున్నారు. ఏపీలో అధికారం వచ్చినా, రాకున్నా బీజేపీతో కయ్యానికి దిగడం పవన్ కు ఇష్టంలేదు. బీజేపీని టీడీపీని కలిపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది సాధ్యపడే అవకాశాలు కన్పించడం లేదు. ఒకవేళ జనసేన, టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సజావుగా ప్రభుత్వాన్ని నడవనిచ్చే పరిస్థితి ఉండదు. సహకరించే పరిస్థితి ఉండదు. రెండు పార్టీలతో ఏర్పడిన ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. అందుకే బీజేపీని దూరం చేసుకోవడం మంచిది కాదన్న అభిప్రాయంలో పవన్ ఉన్నారని తెలిసింది.
ట్రయాంగల్ ఫైట్ తప్పదా?
టీడీపీతో ఇప్పుడు కలిసినా, కలవకపోయినా పెద్దగా నష్టమేమీ లేదు. కాకుంటే అధికారంలోకి రాకపోవచ్చు. 2029 ఎన్నికల నాటికి టీడీపీ మరింత బలహీనమవుతుంది. అప్పుడు పదేళ్ల వైసీపీ పాలనపై అసంతృప్తి పెరిగి తమకు అడ్వాంటేజీ అవుతుందన్న భావన కూడా పవన్ లో ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందుకే పొత్తులపై ఇప్పుడిప్పుడే నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ఓకే. లేకుంటే టీడీపీని ఒంటరిగా వదిలేస్తారు తప్పించి, బీజేపీని మాత్రం వదిలేయరన్నది ఆ పార్టీ ముఖ్యుల నుంచి అందుతున్న సమాచారం. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో చివరి నిమిషంలో ఏదైనా మ్యాజిక్ జరగవచ్చేమో కాని, ఇప్పటి వరకూ ఉన్న పరిస్థితి ప్రకారం ఏపీలో వచ్చే ఎన్నికల్లో ట్రయాంగల్ ఫైట్ తప్పదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.
Next Story