Thu Dec 19 2024 12:31:36 GMT+0000 (Coordinated Universal Time)
బాబుపై పవన్ కు అపనమ్మకం.. ఒంటరి పోటీయేనా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికలను అంత తేలిగ్గా తీసుకోవడం లేదు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికలను అంత తేలిగ్గా తీసుకోవడం లేదు. 25 ఏళ్లు రాజకీయాలు చేస్తానన్న పవన్ వచ్చే ఎన్నికల్లో మాత్రం తాను తాడో పేడో తేల్చుకోవాలనుకున్నట్లే కనపడుతుంది. గతంలో మాదిరి అమాయకంగా స్టేట్మెంట్ లు ఇచ్చేసి అవతల వారికి అధికారం ఇప్పించే పరిస్థితి పవన్ లో ఇప్పుడు కన్పించడం లేదు. ఆయన సన్నిహితుల వద్ద పవన్ సీరియస్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. 2024లో ముఖ్యమంత్రి పదవి దక్కాల్సిందేనని ఆయన గట్టిగా భావిస్తున్నారు.
కాదనడం లేదు...
పొత్తులను పవన్ కాదనడం లేదు. అలాగని అవతలి పక్షం శాసించే విధంగా ఉండకూడదన్నది పవన్ ఆలోచన. జనసేనదే అధికారంలో పై చేయిగా ఉండాలని డిసైడ్ అయ్యారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. చంద్రబాబుతో పొత్తును కుదుర్చుకుంటారు. తొలి దఫా చంద్రబాబును ముఖ్యమంత్రిగా అంగీకరిస్తారనుకుందాం. జనసేన నుంచి ఒక ముప్ఫయి ఎమ్మెల్యేలు గెలిచారనుకుందాం. వారిని తన పార్టీలో కలిపేసుకోరన్న గ్యారంటీ ఏంటన్నది పవన్ కల్యాణ్ అనుమానం. 2014లో అవసరం లేకపోయినా వైసీపీ ఎమ్మెల్యేలన 23 మందిని తన పార్టీలోకి తీసుకుని వారిలో నలుగురికి మంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
బాబు ఒంటరిగా పోటీ చేసినా...
చంద్రబాబును అంత తేలిగ్గా నమ్మలేమని, ఆయనకు మళ్లీ అధికారం అప్పగించి గెలిచిన ఎమ్మెల్యేలను ఆయన పరం చేయలేమని పవన్ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో పొత్తు అవసరం తమకన్నా చంద్రబాబుకే ఎక్కువ అని, ఈసారి ఆయన ఒంటరిగా పోటీ చేసినా గెలవడం కష్టమేనని పవన్ అన్నట్లు తెలుస్తోంది. అందుకే పొత్తుల ప్రస్తావన అటు నుంచి వచ్చేలా చూడాలని, అప్పుడే తాను అనుకున్న మార్గంలో వెళ్లేందుకు పవన్ సిద్ధమయ్యారని సమాచారం.
ఎన్నికల అనంతరం
ఒకవేళ విడివిడిగా పోటీ చేసి జనసేన తనకంటూ సీట్లు సాధిస్తే ఎన్నికల అనంతరం కూడా పొత్తుల గురించి మాట్లాడుకోవచ్చని పవన్ అన్నట్లు తెలిసింది. అందుకే పవన్ ఈ రెండేళ్ల పాటు జనంలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రధానంగా యాభై స్థానాలపై గురిపెట్టి అక్కడ రెండు, మూడుసార్లు ప్రచారం చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడ బలమైన అభ్యర్థుల కోసం సర్వే కూడా చేయిస్తున్నారని చెబుతున్నారు. చంద్రబాబును నమ్మి పొత్తు కుదుర్చుకుని సీఎం పదవిని అప్పగించే యోచనలో పవన్ కల్యాణ్ లేరన్నది వాస్తవం. అందుకే పవన్ ఈసారి సీఎం కుర్చీపై గట్టిగా కర్చీఫ్ వేశారు
Next Story