Thu Jan 16 2025 19:46:09 GMT+0000 (Coordinated Universal Time)
అడుగులు దారి మళ్లాయా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రధాని మోదీతో సమావేశం తర్వాత ఒక స్పష్టత వచ్చినట్లు కనపడుతుంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రధాని మోదీతో సమావేశం తర్వాత ఒక స్పష్టత వచ్చినట్లు కనపడుతుంది. మోదీ ఆయనకు రాజకీయంగా ఏం సలహాలు ఇచ్చారో తెలియదు కాని, పవన్ కల్యాణ్ లో మాత్రం మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. తనను ఈసారి ఆశీర్వదించాలని పదే పదే కోరుతున్నారు. గతంలో పవన్ కల్యాణ్ వైసీపీని వ్యతిరేకించేందుకు వ్యతిరేక ఓట్లను చీలనివ్వనని చెప్పిన పవన్ వాయిస్ లో ఛేంజ్ కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరడమే కాకుండా తాను ఈసారి ఆచితూచి అడుగులు వేస్తానని చెప్పడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
మోదీ మాట్లాడిన తర్వాత...
పవన్ కల్యాణ్ ను విశాఖపట్నంలో పోలీసులు అడ్డుకున్న తర్వాత విజయవాడలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు సమావేశమయ్యారు. ప్రజాసమస్యలపై అందరం కలసి పనిచేయాలని నిర్ణయించారు. ఇది జరిగి దాదాపు నెలన్నర రోజులవుతున్నా మళ్లీ ఇద్దరూ సమావేశం కాలేదు. పైగా విశాఖపట్నం పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ పవన్ కల్యాణ్ ను ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడిన తర్వాత కొంత మారినట్లు కనిపిస్తుంది. మోదీ పవన్ కు రూట్ మ్యాప్ ఇచ్చినట్లే అనిపిస్తుంది. అందుకే 2024, 2029 ఎన్నికలు కీలకమని కూడా ఈరోజు ఇప్పటం గ్రామస్థులతో జరిగిన సమావేశంలో పవన్ మాట్లాడారు.
తనను ఆశీర్వదించాలంటూ...
తెలుగుదేశం పార్టీని తొలుత రాజకీయంగా దెబ్బతీస్తే తనకు ఈ ఎన్నికలు కాకపోయినా, 2029 ఎన్నికల్లోనైనా ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకంతో పవన్ ఉన్నారని అర్థమవుతుంది. చంద్రబాబు నాయకత్వానికి మద్దతు తెలిపేకంటే తాను స్వతహాగా పార్టీని బలోపేతం చేసుకుని ఎన్నికలకు సిద్ధమవ్వాలన్న ధోరణి ఆయనలో కనిపిస్తుంది. అందుకే ఆయన ఈరోజు సమావేశంలో కూడా తాను అడ్డదారులు తొక్కనని, అవినీతికి పాల్పడనని, పాల్పడనివ్వనని కూడా ప్రజలకు హామీ ఇస్తున్నారు. అంటే ఆయన ఈసారి బీజేపీతోనే కలసి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది.
కింగ్ మేకర్ అయితే...
పదే పదే తాను అధికారంలోకి వస్తే అని చెప్పడం వెనక కూడా తానే ముఖ్యమంత్రి అభ్యర్థినన్న విషయాన్ని ఇటు మిత్రులవుదామనుకుంటున్న వారికి, ప్రత్యర్థులకు పవన్ సంకేతాలు పంపుతున్నట్లు అవగతమవుతుంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 2029 ఎన్నికలకు మళ్లీ వైసీపీ పుంజుకునే అవకాశాలున్నాయని ఆయన అంచనాలో ఉన్నట్లుంది. అందుకే పవన్ కల్యాణ్ తాను ప్రత్యేకంగా వెళ్లాలనుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో విడిగా పోటీ చేసి కీలకంగా మారితే టీడీపీ మద్దతుతో అయినా తాను అందలం ఎక్కవచ్చన్న భావన ఆయనలో కనిపిస్తుంది. మొత్తం మీద వైసీపీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూనే తాను కింగ్ మేకర్ గా మారాలన్న ఆలోచనలో ఆయన వెళుతున్నారన్నది అర్థమవుతుంది.
Next Story