Mon Nov 18 2024 03:19:57 GMT+0000 (Coordinated Universal Time)
ఈ ఇద్దరేనా... ఎదగనివ్వరా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంతా తానే చూసుకోవాలనుకుంటున్నారు. రాజకీయం అంతా తన చేతుల మీదుగానే జరగాలని భావిస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంతా తానే చూసుకోవాలనుకుంటున్నారు. రాజకీయం అంతా తన చేతుల మీదుగానే జరగాలని భావిస్తున్నారు. జనసేనలో మరొక నేతకు కీలక బాధ్యతలను అప్పగించడం లేదు. నేతలకు బాధ్యతలను పంచకపోవడంతోనే జనసేన క్షేత్రస్థాయిలో బలోపేతం కావడం లేదన్న విమర్శలు పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. జనసేనలో నేతలను వేళ్ల మీద లెక్కేసుకోవచ్చు. జిల్లాల వారీగా బాధ్యతలను కొందరు నేతలకు అప్పగించే పనిని పవన్ చేయడం లేదు. అందుకే పార్టీ ఎక్కడి వేసిన గొంగళి అన్న చందంగా తయారయింది.
ఏ పని చేయాలన్నా....
జనసేన పేరు చెబితే ఇద్దరి పేర్లే గుర్తుకు వస్తాయి. ఒకటి పవన్ కల్యాణ్. రెండు నాదెండ్ల మనోహర్. ఇంకా నేతలు జిల్లాల్లో అనేక మంది ఉన్నా వారెవరికీ స్వేచ్ఛ లేదు. నియోజకవర్గాల్లో పర్యటించే హక్కులేదు. ఏ అంశంపైనైనా మాట్లాడే అవకాశం లేదు. ఎవరూ స్వేచ్ఛగా కార్యక్రమాలను నిర్వహించేందుకు కూడా వీలు లేదు. ఏది చేయాలన్నా పార్టీ హైకమాండ్ కు తెలపాల్సి ఉంటుంది. పవన్ కల్యాణ్ తో నేరుగా మాట్లాడే అవకాశం లేదు. పోనీ నాదెండ్ల మనోహర్ తో నయినా సంప్రదించాలన్నా ఆయన కూడా పెద్దగా జిల్లా స్థాయి నేతలకు అందుబాటులో ఉండరు.
ప్రజారాజ్యం దెబ్బకు..
పవన్ కల్యాణ్ వస్తే తప్ప జనసేన కార్యక్రమాలు జిల్లాల్లో జరగవు. లేదా నాదెండ్ల పర్యటన ఉంటే కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. పవన్ కల్యాణ్ తొలి నుంచి పార్టీలో నేతల ఎదుగుదలకు పెద్దగా ఇష్టపడటం లేదు. ప్రజారాజ్యం మిగిల్చిన దెబ్బలతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు కనపడుతుంది. జనసేనను అడ్డుపెట్టుకుని ఏదైనా అవకతవకలకు పాల్పడాతరన్న భయం ఉంది. అందుకే ఏ నేతకు పూర్తి స్థాయిలో పవర్ ఇవ్వరు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు తప్ప సొంతంగా స్థానిక సమస్యలపై నేతలు కార్యక్రమాలను చేపట్టడానికి వీలు లేకుండా పోయిందని కొందరు జనసేన నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాగే కొనసాగితే....
అయితే జనంలో ఎదగాలన్నా, వచ్చే ఎన్నికల్లో గెలవాలన్నా స్థానిక నేతలతో జనసేన నేతలు కలిసి పోవాలి. పార్టీ బలంగా ఉందనుకుంటున్న తూర్పు గోదావరి జిల్లాలో ఒకరిద్దరు నేతలు మినహా తప్ప నియోజకవర్గ స్థాయి నేతల పేర్లు ఎవరూ చెప్పలేని పరిస్థితి. కానీ కొందరు పవన్ పై అభిమానంతో పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు తప్ప పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయడం లేదు. పార్టీ మొత్తం ఆ ఇద్దరి మీదనే నడవాలంటే సాధ్యం కాదు. జిల్లా స్థాయి నేతలకు పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగిస్తే తప్ప జనంలోకి జనసేన వెళ్లదు. పవన్ చెబుతున్నట్లు జనం తన పార్టీ వైపు చూడాలన్నా బలమైన నేతలు ఆ పార్టీకి అవసరం. లేకుంటే ఎప్పటి మాదిరిగానే రిజల్టు ఖాయంగా చూడక తప్పదు.
Next Story