Sun Nov 17 2024 20:34:03 GMT+0000 (Coordinated Universal Time)
యువగళంలో "సేన" రంకెలు
టీడీపీ, జనసేన పొత్తు అధికారికంగా ప్రకటన వెలువడకముందే యువగళం పాదయాత్రలో జనసేన జెండాలు కనిపిస్తున్నాయి
బాస్లిద్దరూ ముచ్చట్లాడుకుంటుంటే... కింది స్థాయి క్యాడర్ ఊరుకుంటుందా? ఎటూ పొత్తు ఖాయమని తేలిపోయింది కాబట్టి జనసేన క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు కూడా అర్థమయినట్లే ఉంది. అందుకే పొత్తు ప్రకటన రాకముందే క్షేత్రస్థాయిలో కలసి నడవాలని నిర్ణయించుకున్నట్లుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 85వ రోజులు దాటింది. ఇప్పటి వరకూ జనసేన పాదయాత్రకు దూరంగానే ఉంది. కానీ పవన్ కల్యాణ్ రెండు రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారో.. లేదో... వెంటనే జెండాలు పట్టుకుని రంగంలోకి దిగారు.
పొత్తులు తేలకున్నా...
పొత్తులు ఇంకా కుదరలేదు. సీట్ల పంపిణీ తేలలేదు. కేవలం ఇద్దరు పార్టీ అధినేతల మధ్య చర్చలు మాత్రమే జరిగాయి. ఇంకా పలుదఫాలు చర్చలు జరుగుతాయని చెబుతున్నారు. సీట్లు, అధికారంలోకి వస్తే పదవులపై చర్చ జరగాల్సి ఉంది. కేవలం ఇద్దరు అధినేతల మధ్య చర్చ జరిగినా.. అందుకు రెండు పార్టీలు ఒక కమిటీని వేసే యోచనలో ఉన్నాయి. ఆ కమిటీలు తమ బలంగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేసే స్థానాలను గుర్తించి ఇరు పార్టీల అధినేతలకు ఇచ్చుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాతనే సీట్ల పంపకంపై చర్చలుంటాయని జనసేన సీనియర్ నేత ఒకరు చెప్పారు.
సీట్ల పంపకంపై...
ప్రధానంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో కొంత భాగం, ప్రకాశం, నెల్లూరులో కొన్ని స్థానాలను జనసేన కోరే అవకాశాలున్నాయి. అయితే ఇందుకు టీడీపీ కూడా అంగీకరించాల్సి ఉంటుంది. సరైన స్థానాలు ఇవ్వకపోతే జనసేన పొత్తు కుదర్చుకునే అవకాశం లేదు అని కూడా అంటున్నారు. అవసరం ఇప్పడు ఇద్దరిదీ. ఒకరి అవసరం మరొకరిది. వైసీపీని ఓడించాలంటే ఇద్దరూ కలవని పరిస్థితి. కలవకుంటే 2019 ఎన్నికల ఫలితాల రిపీట్ అవుతాయని ఆందోళన రెండు పార్టీలలోనూ ఉంది. ఎవరు తగ్గుతారు? ఎవరు నెగ్గుతారు? అన్నది పక్కన పెడితే పొత్తు ఖాయమని దాదాపుగా తేలిపోయింది. అధికారికంగా ప్రకటన మాత్రమే చేయాల్సి ఉంది. అయితే ఈలోగానే కిందిస్థాయి క్యాడర్లో కూడా ఒక అవగాహన వచ్చినట్లు కనిపిస్తుంది.
యువగళం యాత్రలో...
ఇప్పటి వరకూ యువగళం పాదయాత్రలో ఇప్పటి వరకూ కన్పించని జనసేన జెండాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర జరుగుతుంది. ఆ యాత్రలో జనసేన క్యాడర్ కూడా లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ పాల్గొనడటంతో యువత ఉత్సాహంతో ఉరకలేస్తుంది. లోకేష్ పాదయాత్ర పేరే యువగళం. దీంతో యువత కేరింతలు కొడుతూ పాల్గొంటుండటంతో లోకేష్ మరింత ఉత్సాహంగా నడుస్తున్నారు. రాయలసీమలో బలిజ సామాజికవర్గం బలంగా ఉంది. జనసేనకు ఆ సామాజికవర్గం మద్దతు పలికితే గెలుపు సాధ్యమని టీడీపీ భావిస్తుంది.
Next Story