Mon Dec 23 2024 14:22:30 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ ఎప్పుడూ ఒంటరేనా? ఫ్యామిలీ ఈసారీ దూరమేనా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలి నుంచి ఒంటరి వారే. ఆయన జనసేన పార్టీని 2014లో స్థాపించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలి నుంచి ఒంటరి వారే. ఆయన జనసేన పార్టీని 2014లో స్థాపించారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో ఒంటరిగానే ప్రయాణం చేస్తున్నారు. ఆయనకు కుటుంబ సభ్యుల మద్దతు దాదాపుగా లేదనే చెప్పాలి. ఆయన నిర్ణయాలు, పార్టీ స్థాపనను కుటుంబ సభ్యులు పెద్దగా వ్యతిరేకించకపోయినా మద్దతిచ్చేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. మెగా ఫ్యామిలీ మద్దతు పెద్దగా లేకుండానే ఆయన తన రాజకీయ ప్రయాణం కొనసాగిస్తున్నారు.
కుటుంబ సభ్యుల...
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ప్రచారంలోనూ, పార్టీ పరంగా కుటుంబ సభ్యులు వెన్నుదన్నుగా నిలుస్తారు. చంద్రబాబు ఎన్టీఆర్ నుంచి పార్టీని తీసుకున్నా నందమూరి కుటుంబ సభ్యులంతా ఒక్కటిగా నిలిచి చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొని పార్టీ విజయానికి కృషి చేసేవారు. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ సయితం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
గత ఎన్నికల్లోనూ....
ఇక జగన్ విషయం అందరికీ తెలిసిందే. ఆయన పార్టీ పెట్టిన నాటి నుంచి తల్లి విజయమ్మతో పాటు చెల్లెలు సోదరి అండగా నిలిచారు. 2014, 2019 ఎన్నికల ప్రచారంలో ఇద్దరూ పాల్గొన్నారు. వైఎస్ కుటుంబమంతా ఆయనకు అండగా నిలిచింది. ఇక పవన్ కల్యాణ్ విషయానికొస్తే ఆయనకు మెగా ఫ్యామిలీ మద్దతు పెద్దగా లభించలేదు. నాగబాబు మినహా ఎవరూ జనసేన పార్టీ వైపు చూడలేదు. 2019 ఎన్నికల్లో మాత్రమ రామ్ చరణ్, బన్నీ, వరుణ్ తేజ్ వంటి వారు అక్కడక్కడా ప్రచారం చేసి వెళ్లారు.
ప్రజారాజ్యం పెట్టినప్పుడు.....
ిచిరంజీవి 2009 లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం ఒక్కటిగా నిలిచింది. పార్టీలోనూ వారు భాగస్వామ్యులయ్యారు. పవన్ కల్యాన్ యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నారు. ఇటు అల్లు అరవింద్ కూడా చిరంజీవి వెంట నిలిచి చేదోడు వాదోడుగా నిలిచారు. ప్రచారంలోనూ అందరూ పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ 2009 ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అన్నకు మద్దతునిచ్చారు.
చిరు కామెంట్స్ తో....
అశేష అభిమానుల బలం ఉన్న చిరంజీవి మాత్రం జనసేనకు తొలి నుంచి దూరంగానే ఉన్నారు. ప్రత్యక్ష మద్దతును ఎప్పుడూ ప్రకటించలేదు. వచ్చే ఎన్నికలకు జనసేనను పవన్ కల్యాణ్ సిద్దమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో చిరంజీవి జగన్ ను కలసి ప్రశంసలు గుప్పించడం మెగా అభిమానుల్లో ఆందోళన మొదలయింది. జనసేన క్యాడర్ కూడా అయోమయంలో పడింది. చిరంజీవి వచ్చే ఎన్నికల్లోనూ ఎవరికీ మద్దతు తెలిపే అవకాశం లేదు. దీనికి తోడు జగన్ ను తన సోదరుడిగా పేర్కొనడం జనసేనకు ఇబ్బందిగా మారింది. వచ్చే ఎన్నికల్లోనూ పవన్ కల్యాణ్ ఒంటరిగానే మిగిలిపోతారేమోనన్న ఆందోళన మెగా ఫ్యాన్స్ లో కనపడుతుంది.
Next Story