Mon Dec 23 2024 07:01:46 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ కు ఏమైంది...? ఎందుకిలా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సరైన సమయంలో అందుబాటులో ఉండరు. అదే ఆయనకు మైనస్ పాయింట్ అంటారు.
రాజకీయ నాయకుడు ఎప్పుడైనా ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ ఉండాలి. వాటిని వదిలి పెట్టకుండా వెంటపడుతుంటేనే నాయకత్వంపై నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం పొందే ప్రయత్నాన్ని పవన్ కల్యాణ్ ఎప్పుడూ చేయరు. తనకు తోచినప్పుడే ఆయనకు బయటకు వస్తారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సరైన సమయంలో అందుబాటులో ఉండరు. అదే ఆయనకు మైనస్ పాయింట్ అంటారు.
కొత్త జిల్లాల ఏర్పాటు.....
మొన్నటి వరకూ గుడివాడలో కొడాలి నాని క్యాసినో వ్యవహారం ఏపీని ఒక ఊపు ఊపింది. కానీ జనసేనాని మాత్రం ఈ విషయంలో పెదవి విప్పలేదు. సరే... దాని విషయం పక్కన పెడితే కొత్త జిల్లాల ఏర్పాటుపై నోటిఫికేషన్ వచ్చింది. కొన్ని జిల్లాల్లో ప్రజలు అసంతృప్తితో రోడ్డుపైకి వచ్చారు. మదనపల్లె, హిందూపురం, రాజంపేట, చీరాల, నరసాపురం వంటి ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్ ను నిర్వహించారు.
జిల్లాల నుంచి ఫీడ్ బ్యాక్....
కానీ పవన్ కల్యాణ్ నుంచి కొత్త జిల్లాలపై ఎటువంటి స్పందన రాలేదు. ప్రభుత్వం అభ్యంతరాలుంటే తెలియజేయవచ్చని నెలరోజుల సమయం ఇచ్చింది. అయినా పవన్ కల్యాణ్ జిల్లా నేతలతో చర్చించి కొత్త జిల్లాల ఏర్పాటులో సమస్యలపై చర్చించలేదు. దానిని వదిలేశారు. మరోవైపు వంగవీటి రాధా పేరు పెట్టాలని, పవన్ స్పందించాలని ఆయన సామాజికవర్గం నుంచి వత్తిడి వస్తుంది. అయినా పవన్ దానిని పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఉద్యోగుల సమ్మె.....
ఇక మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. వారు ఏ రాజకీయ పార్టీ సహకారాన్ని ఆశించకపోయినా అన్ని పార్టీల నేతలు వారికి మద్దతు తెలిపారు. ఈ నెల 6వ తేదీ నుంచి వారు సమ్మెకు వెళుతున్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం నేరుగా స్పందించలేదు. వారికి సంఘీభావం కూడా తెలపలేదు. పదమూడు లక్షల మంది ఉన్న ఉద్యోగులు, పింఛనుదారులను పవన్ లైట్ గా తీసుకున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. పవన్ చివరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ, సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపుపైనే మాట్లాడారు. అంతకు మించి మిగిలిన ప్రధాన సమస్యలపై జనసేనాని స్పందించకపోవడం పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది.
Next Story