Thu Jan 16 2025 05:30:04 GMT+0000 (Coordinated Universal Time)
లెక్క కరెక్ట్ గానే ఉందట.. కిక్కిచ్చేస్తుందట
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూర్తి విశ్వాసంతో ఉన్నారు. టీడీపీలో నాయకత్వ లేమి తనకు కలసి వస్తుందని భావిస్తున్నారు.
రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎప్పుడు ఎవరి గాలి వీస్తుందో చెప్పలేం. మూడ్ ఆఫ్ ది స్టేట్ ను బట్టి అధికారం చేతులు మారుతుంటుంది. ఏపీలో ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితులను చూస్తే తెలుగుదేశం పార్టీ ఇంకా బలం పుంజుకోలేదు. ఎక్కడా క్యాడర్ లో జోష్ లేదు. చంద్రబాబు మాత్రం వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలవలని పడరాని పాట్లు పడుతున్నారు. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం బిందాస్ గా ఉన్నారు.
వైసీపీకి ప్రత్యామ్నాయం....
పవన్ కల్యాణ్ లెక్కలు వేరుగా ఉన్నాయంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, లేకపోవడం మాట అటుంచితే భవిష్యత్ జనసేనదేనని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన మూడు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఇక్కడ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, కమ్యునిస్టులు నామమాత్రం. వాటి ప్రభావం కూడా ఎన్నికల్లో పెద్దగా ఉండదు. అయితే వైసీపీ అధినేత జగన్ యువకుడు బలంగా ఉన్నారు.
అధికారంలో ఉండటంతో....
అధికారంలో జగన్ ఉండటంతో ఆయనపై అసంతృప్తి జనాల్లో రావడం సహజమే. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా టీడీపీ ఎదగడం లేదని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఇటీవల చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడంతో నాయకత్వంపై నమ్మకం పోయింది. అలాగే టీడీపీకి భవిష్యత్ నాయకుడంటూ ఎవరూ లేరు. జూనియర్ ఎన్టీఆర్ మరో దశాబ్దకాలం పాటు రాజీకీయాల వైపు చూసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీ వైసీపీకి ప్రత్యామ్నాయం కాదని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు.
తనకే అవకాశమని....
అందుకే జనసేనను మరింత బలోపేతం చేస్తే తమ పార్టీవైపు జనం ఎప్పటికైనా చూస్తారన్న అంచనాలో ఉన్నారు. టీడీపీ తనకు ప్రధాన శత్రువు కాదు. అది దానంతట అదే అంతరించిపోతుందన్న లెక్కల్లో ఉన్నారు. అందుకే పవన్ కల్యాణ్ అధికార వైసీీపీని టార్గెట్ చేస్తున్నారని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ఒకవేళ 2024 ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ వద్ద ఇబ్బందులు ఎదురైతే తాను ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్న అంచనాలో ఉన్నారు. టీడీపీ తనకు మద్దతిచ్చి ఖచ్చితంగా సీఎంను చేస్తుందన్న అంచనాలో పవన్ కల్యాణ్ ఉన్నారు.
Next Story