Fri Nov 22 2024 19:46:27 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీ బలిపశువేనా?
భారతీయ జనతా పార్టీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తుకు ఫుల్స్టాప్ పెట్టే యోచనలో ఉన్నారు.
భారతీయ జనతా పార్టీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తుకు ఫుల్స్టాప్ పెట్టే యోచనలో ఉన్నారు. ఆయన మచిలీపట్నం సభలో ఈ సంకేతాలు ఇచ్చారు. తాను తెలుగుదేశం పార్టీతో కలిసే ప్రయత్నం చేయడానికి కూడా పవన్ కారణాలు వివరించారు. నిజానికి బీజేపీ నేతలే తాము చేతులారా స్నేహాన్ని చెడగొట్టుకున్నట్లు ఆయన మరోసారి జాతీయ నాయకత్వానికి స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. 2019 ఎన్నికలు పూర్తయిన వెంటనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. ఆయన 2024 ఎన్నికల్లో బీజేపీతోనే కలసి వెళదామనుకున్నారని భావించారట.
నాలుగేళ్లకు ముందు...
అందుకే ఎన్నికలకు నాలుగున్నరేళ్ల ముందు బీజేపీతో పవన్ పొత్తు కుదుర్చుకున్నారు. ఈ నాలుగేళ్లలో రెండు పార్టీలు కలసి సమన్వయంతో పనిచేసుకుంటూ ముందుకు వెళితే తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టవచ్చని భావించారు. అదే సమయంలో వైసీపీకి కూడా ప్రత్యామ్నాయంగా బీజేపీ, జనసేన కూటమి ఎదుగుతుందని పవన్ భావించారట. అందుకు సమయం కూడా ఉండటంతో సాధ్యమని నమ్మారు. మరోవైపు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటం కూడా తమ కూటమికి కలసి వస్తుందన్న అంచనా వేశారు. అందుకే ఢిల్లీ వెళ్లి మరీ చేతులు కలిపి వచ్చారు.
బెజవాడ రాగానే...
అయితే ఢిల్లీలో తాను ఇచ్చిన మాటకు బెజవాడ రాగానే ప్లాన్ మార్చారన్నది పవన్ ఆరోపణ. అమరావతిలో తాను ఢిల్లీ పెద్దలను కలిసినప్పుడు విజయవాడ టు అమరావతి ర్యాలీ నిర్వహించాలని అనుకున్నారు. అయితే ఢిల్లీలో అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ ర్యాలీకి పవన్ పిలుపునిచ్చినా, ఇక్కడ రాష్ట్ర బీజేపీ నేతలు అందుకు పడనివ్వలేదట. అందుకే ఆయన ఆరోజు నుంచి బీజేపీతో కలసి ఏ కార్యక్రమమూ చేయలేదని చెబుతున్నారు. ఇద్దరం కలసి కార్యక్రమాలు చేసి ఉంటే ఈ పాటికి పార్టీ బలోపేతమయ్యేదని కూడా నిన్నటి సభలో చెప్పారు. తెలుగుదేశం పార్టీ పట్ల ప్రత్యేక అభిమానం, ప్రేమ ఏవీ లేవని చెబుతూనే, వైసీపీ అధికారంలోకి రాకూడదనే తప్పనిపరిస్థితుల్లో టీడీపీ వైపు చూడాల్సి వచ్చిందని పరోక్షంగా చెప్పడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.
ప్రయోగాలు చేయబోనని...
అప్పుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. మరి పవన్ అమరావతి ర్యాలీకి అడ్డుపడిన నేతలు ఎవరో మాత్రం ఆయన చెప్పకపోయినా, సోము వీర్రాజు బ్యాచ్ అన్నది పార్టీ వర్గాలు పరోక్షంగా చెప్పినట్లయింది. అయితే బీజేపీ తాము ఏర్పాటు చేసే కూటమితో కలసి వస్తే సరి, లేకుంటే బీజేపీని వదిలేయడానికి కూడా పవన్ కల్యాణ్ సిద్ధపడినట్లు నిన్నటి సభలో కనిపించింది. బీజేపీతో మాత్రమే కలసి వెళ్లడానికి పవన్ సిద్ధంగా మాత్రం లేరు. ఎందుకంటే ఈసారి ఎటువంటి ప్రయోగాలు చేయబోనని ఆయన స్పష్టం చేయడమే కాకుండా ఈసారి బలిపశువును కానివ్వబోనని చెెప్పి బీజేపీకి పవన్ పరోక్ష సంకేతాలు ఇచ్చినట్లయింది. కేంద్రంలో నాలుగేళ్లు అధికారంలో ఉన్న పార్టీతో కలిసి తిరిగి ఎన్నికల సమయానికి వదిలేయడం కూడా సరికాదన్న కామెంట్స్ కమలనాధుల నుంచి వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు నిలవాలా? కలవాలా? అన్నది బీజేపీ మాత్రమే తేల్చుకోవాల్సి ఉంటుంది.
Next Story