Sat Nov 23 2024 09:02:11 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ కు విసుగు పుడుతుందా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ అధిష్టానం నుంచి రోడ్డు మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ అధిష్టానం నుంచి రోడ్డు మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే జనసేన ఆవిర్భావ సభలో స్వయంగా చెప్పారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఎప్పుడు రోడ్డు మ్యాప్ పై క్లారిటీ వస్తుందన్న దానికి ఎవరి వద్ద సమాధానం లేదు. ఇటీవల నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహం మీద బీజేపీ నాయకత్వం ఉంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతుంది.
ఫోకస్ అంతా....
గుజరాత్ ఎన్నికల తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికలు ఉన్నాయి. ఈ నాలుగు రాష్ట్రాలు బీజేపీకి ప్రతిష్టాత్మకం. గుజరాత్ మోదీ సొంత రాష్ట్రం కాబట్టి అధికారాన్ని అక్కడ నిలబెట్టుకోవాలి. మధ్యప్రదేశ్ లోనూ గత ఎన్నికల్లో ఓటమి పాలయినా ఎలాగోలా అధికారాన్ని దక్కిించుకోగలిగారు. ఈసారి రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో గెలిచి తీరాలి. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలో కొంత స్పేస్ ఉండటంతో ఇక్కడ పట్టు సాధించాల్సి ఉంటుంది.
వరస ఎన్నికలతో...
ఇన్ని రాష్ట్రాల ఎన్నికలపైన బీజేపీ అధినాయకత్వం ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ఏపీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగానే సమయం ఉంది. అప్పటి వరకూ అధికార పార్టీ మీద పోరాటం చేయాలని ఇప్పటికే పార్టీ అధినాయకత్వం బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి రూట్ మ్యాప్ ఇచ్చింది. ఆ మేరకు రాష్ట్ర బీజేపీ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు పవన్ కు రోడ్డు మ్యాప్ అందించే అవకాశం లేదంటున్నారు.
ఇప్పట్లో స్పష్టత....
ప్రధానంగా పొత్తులపై ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం లేదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. 2024 ఎన్నికలకు ఏడాది ముందు మాత్రమే పొత్తులపై కేంద్ర నాయకత్వం క్లారిటీ ఇవ్వనుందని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. అయితే మరో రెండేళ్ల పాటు రోడ్డు మ్యాప్ కోసం పవన్ కల్యాణ్ ఎదురు చూస్తారా? లేదంటే తన దారి తాను చూసుకుంటారా? అన్నది తేలాల్సి ఉంది. పవన్ కోరుకుంటున్నట్లు రోడ్డు మ్యాప్ ఇప్పటికిప్పుడు వచ్చే అవకాశం మాత్రం లేదు. మరి జనసేనాని ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది.
Next Story