Wed Dec 25 2024 05:43:52 GMT+0000 (Coordinated Universal Time)
నాదెండ్ల అంతవరకే పరిమితమా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ను కొంత దూరం పెట్టినట్లే కనపడుతుంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ను కొంత దూరం పెట్టినట్లే కనపడుతుంది. ఆయనతో రానున్న కాలంలో కొంత ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన పవన్ కల్యాణ్ ఆయనకు తన పర్యటనల బాధ్యతలను మాత్రమే అప్పగించినట్లు సమాచారం. ముఖ్యమైన నిర్ణయాలలో నాదెండ్ల జోక్యం లేకుండా ఉండేలా పవన్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
క్రియాశీలకంగా...
నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరిన నాటి నుంచి క్రియాశీలకంగా ఉన్నారు. ఆయనకు రాజకీయ వ్యవహారా కమిటీ ఛైర్మన్ పదవిని పవన్ అప్పగించారు. అయితే నాదెండ్ల తీరుతో అనేక మంది తనకు తొలి నుంచి అండగా ఉన్న వారు పార్టీ నుంచి వెళ్లిపోవడాన్ని పవన్ గమనించారు. తనతో ఎవరినీ కలవనివ్వకపోవడం, ముఖ్యమైన విషయాలపై చర్చించకుండా అడ్డుకోవడం వంటి వాటిపై నాదెండ్లపై పవన్ కు ఫిర్యాదులు అందాయని తెలుస్తోంది.
పోయినోళ్లంతా....
గతంలో అనేక మంది పార్టీని వీడారు. జేడీ లక్ష్మీనారాయణ దగ్గర నుంచి మొన్నటి మాదాసు గంగాధరం వరకూ పార్టీ వీడటానికి కారణం నాదెండ్ల మనోహర్ కారణమని పవన్ కు ఫిర్యాదులు అందాయి. ముఖ్యమైన, పార్టీకి తొలి నుంచి అండగా నిలిచిన నేతలు కూడా నాదెండ్ల వైఖరితో ఇబ్బంది పడుతున్నారన్న ఆరోపణలు జనసేనాని దృష్టికి వచ్చాయంటున్నారు. అంతేకాకుండా నాదెండ్ల జిల్లాల పర్యటనల్లో కూడా అక్కడి నేతలు గ్రూపులుగా మారుతుండటాన్ని పవన్ గమనించారంటున్నారు.
చేరికలు కూడా....
దీంతో పాటు జనసేనలో చేరికలు లేెకపోవడానికి కూడా నాదెండ్ల మనోహర్ కారణమని భావించిన పవన్ కల్యాణ్ ఆయనను దూరంగా పెట్టాలని నిర్ణయించారని తెలిసింది. తన పర్యటనల బాగోగులను చూడటం వరకే నాదెండ్లను పరిమితం చేయాలని ఆయన భావిస్తున్నారట. సామాజికవర్గం దృష్ట్యా పైకి నాదెండ్లకు పబ్లిక్ సమావేశాల్లో ప్రాధాన్యత ఉన్నట్లు కన్పించినా గతంలో మాదిరిగా ఆయనకు ముఖ్య నిర్ణయాల్లో మాత్రం ప్రయారిటీ ఉండే అవకాశం లేదన్నది జనసేన వర్గాల నుంచి విన్పిస్తున్న టాక్.
Next Story