Fri Nov 08 2024 19:55:11 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ రెస్సాన్స్ లేదు.. చెడిందా ఏంది?
గన్నవరం ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించకపోవడం హాట్ టాపిక్ గా మారింది
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతి విషయంలో స్పందిస్తారు. అందులోనూ వైసీపీ ప్రభుత్వంలో జరిగే ఈ ఘటనపైనా ఆయన తక్షణమే స్పందిస్తారు. కానీ గన్నవరం ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఒకే ఒక ఘటన గన్నవరంలో జరిగిన సంఘటనపై పవన్ పెదవి విప్పనీయకుండా చేసిందా? అంటే అవుననే అంటున్నారు. పవన్ కల్యాణ్ ప్రతి విషయంలో స్పందిస్తారు. ఆయన ఎంత సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నా సరే ఏపీ రాజకీయాల్లో జరిగే ఘటనపై ఆయన ట్విట్టర్ లో స్పందిస్తుంటారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారు.
అనపర్తి ఘటనపైనా...
ఇటీవల అనపర్తిలో చంద్రబాబును అడ్డుకోవడం, కిలోమీటర్ల కొద్దీ పెద్దాయనను నడిపించడంపైన కూడా పవన్ కల్యాణ్ స్పందించారు. ఇది అమానుషమని అన్నారు. కానీ గన్నవరం లో టీడీపీ కార్యాలయంపై దాడులు, పట్టాభి అరెస్ట్ వంటి అంశాలపై మాత్రం పవన్ కల్యాణ్ పెదవి విప్పలేదు. దీంతో రాజకీయ పార్టీలో ఇది చర్చనీయాంశంగా మారింది. ఇందుకు రెండు కారణాలు చూపెడుతున్నారు. ఒకటి తన సామాజికవర్గమైన కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరడం. జనసేన పార్టీ ఉన్నా అందులో కన్నా చేరకుండా టీడీపీలో చేరారంటే జనసేనపై నమ్మకం లేకనే అన్న సంకేతాలు ఇటు సామాజికవర్గంలోనూ అటు పార్టీ అభిమానుల్లోనూ, పవన్ ఫ్యాన్స్ లోనూ నెలకొంది.
వెయ్యి కోట్ల ఆఫర్ అంటూ...
రెండోది మరొకటి. కీలకమైనదే. పవన్ కల్యాణ్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెయ్యి కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు వచ్చిన కథనం కూడా పవన్ ను హర్ట్ చేసిందంటున్నారు. తనపై చంద్రబాబు అనుకూల మీడియా ఇప్పటి నుంచే దాడులు ప్రారంభించిందన్న అనుమానం పవన్ కల్యాణ్ లో కలిగిందంటున్నారు. ముఖ్యమంత్రి పదవి అడక్కుండా ముందర కాళ్లకు బంధం వేసే ప్రయత్నం జరుగుతందని ఆయన సందేహిస్తున్నారు. జనసేన క్యాడర్ లోనూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై అసహనం, అసంతృప్తి పెరిగిపోయాయి. సోషల్ మీడియాలో పవన్ ను టీడీపీతో పొత్తు వద్దంటూ పోస్టులు పెడుతున్నారు. నాగబాబు కూడా కొంత సీరియస్ గానే రెస్పాండ్ అయ్యారు. కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.
అనుమానం బయలుదేరిందా?
పవన్ కూడా వైసీపీ నేతలు ప్యాకేజీ అంటే పెద్దగా పట్టించుకోలేదు. దానిని రాజకీయ విమర్శగానే కొట్టిపారేశారు. ఒకసారి సీరియస్ అయి చెప్పుతో కొడతానంటూ తనను ప్యాకేజీ అన్న వారిపై ఫైర్ అయ్యారు పవన్ కల్యాణ్. కానీ పొత్తులు కుదరక ముందే చంద్రబాబు అనుకూల మీడియాలో వెయ్యి కోట్ల ప్యాకేజీ అని రావడం, అదీ ఎడిటోరియల్ కావడంతో పవన్ లో కూడా అనుమానాలు బయలుదేరాయి. భవిష్యత్ లో తాను టీడీపీతో పొత్తు కుదుర్చుకుని అధికారంలోకి తెచ్చినా ఈ మీడియా ద్వారా తనను వెంటాడతారని, తాను మరోసారి ఫూల్ కావడం ఇష్టపడకపోవచ్చని పవన్ కల్యాణ్ సన్నిహితుల వద్ద అన్నట్లు సమాచారం. మొత్తం మీద గన్నవరం ఘటనపై పవన్ స్పందించకపోవడానికి ఈ రెండు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.
Next Story