Wed Nov 27 2024 17:48:18 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ టార్గెట్ అదేనా?
జనసేన ఆవిర్భావ సభ నేడు గుంటూరు జిల్లా మంగళగిరిలో జరగనుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న రాత్రి విజయవాడ చేరుకున్నారు.
జనసేన ఆవిర్భావ సభ నేడు గుంటూరు జిల్లా మంగళగిరిలో జరగనుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న రాత్రి విజయవాడ చేరుకున్నారు. పార్టీ ఆవిర్భవించి ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న ఈ సభకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగంపైనే అందరి దృష్టి ఉంది. పొత్తులపై ఆయన స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముంది. వైసీపీని ఓడించేందుకు ఎవరితోనైనా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెబుతారంటున్నారు.
బంధాల విషయంలో....
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో జనసేన ఉంది. పవన్ పార్టీని పెట్టిన తర్వాత రెండోసారి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఈసారి ఖచ్చితంగా అనుకున్న టార్గెట్ ను రీచ్ అవ్వాలన్న తపన ఆయనలో కన్పిస్తుంది. అవసరమైతే కొన్ని బంధాలను తెంచుకునేందుకు, పాత బంధాలను కలుపుకునేందుకు కూడా పవన్ కల్యాణ్ రెడీ అవుతారంటున్నారు. ఈ సభలో పవన్ కల్యాణ్ ఏం మాట్లాడతారన్న దానిపై ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.
సొంత సామాజికవర్గం....
అధికార పార్టీని ఖచ్చితంగా పవన్ కల్యాణ్ టార్గెట్ చేస్తారు. ఇది అందరికి తెలిసిందే. అయితే కొత్తగా కాపు సామాజికవర్గంపైన కూడా ఒక ప్రకటన చేసే అవకాశముందని చెబుతున్నారు. జనసేన లక్ష్యాలను వివరించడంతో పాటు వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయడంపై కూడా పవన్ కల్యాణ్ దృష్టి పెడతారంటున్నారు. జనసేన ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు, కార్యకర్తలు విజయవాడకు చేరుకున్నారు. బెజవాడ వీధులన్నీ జనసైనికులతో నిండిపోయాయి.
Next Story