Mon Dec 23 2024 00:58:24 GMT+0000 (Coordinated Universal Time)
నేనే సీఎం.. అందుకు అదే మార్గం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సత్తెనపల్లి సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సత్తెనపల్లి సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం రెండు వర్గాలకే ముఖ్యమంత్రి పదవులు దక్కుతున్నాయని, బలహీనవర్గాలకు అధికారం దక్కాలన్నదే తన లక్ష్యమని పవన్ అన్నారు. ఇన్నాళ్లూ అధికారానికి దూరంగా ఉన్న వర్గాలకు అధికారాన్ని దగ్గర చేయడం కోసమే తాను పనిచేస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తానే సీఎం అవుతానని, అయితే మీరంతా బలంగా కోరుకుంటే ముఖ్యమంత్రిని అవుతానని పవన్ కల్యాణ్ ప్రకటించారు.
వైసీపీ మాత్రం అధికారంలోకి రాదు....
వైసీపీని మాత్రం వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రానివ్వనని పవన్ పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని గతంలో చెప్పిన మాటలకు తాను కట్టుబడి ఉన్నానని ఆయన తెలిపారు. వైసీపీని ఓడించేందుకు ఎవరితోనైనా కలుస్తానని తెలిపారు. వైసీపీని అధికారం నుంచి దించడమే లక్ష్యంగా తాను పనిచేస్తానని తెలిపారు. వైసీపీ ఉంటే ఆంధ్రప్రదేశ్ మరింత వెనకబడి పోతుందని, తాను రెండు తరాల భవిష్యత్ గురించి ఆలోచన చేస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు.
వ్యూహాన్ని నాకు వదలేయండి...
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ వ్యవస్థలను ఉపయోగించి అనేక దారుణాలకు పాల్పడుతుందని, జనసైనికులు అందరూ అందుకు సిద్ధంగా ఉండాలని పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి వ్యూహాన్ని తనకు వదిలేయాలని, అందరూ పార్టీని విజయ పథాన నడిపేందుకు కలసి పనిచేయాలని క్యాడర్ కు పవన్ పిలుపు నిచ్చారు. తాను ఎవరికీ అమ్ముడు పోయే వ్యక్తిని కానని, అంత ఖర్మ తనకు పట్టలేదని పవన్ అన్నారు.
ఎవరు అడ్డుకుంటారో చూస్తా...
వారాహి వాహనంలో త్వరలో ఆంధ్రప్రదేశ్ లో పర్యటన చేస్తానని, ఎవరు అడ్డుకుంటారో చూస్తానని పవన్ కల్యాణ్ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. తనకు ఎవరి నుంచో డబ్బులు గుంజుకోవాలన్న ఆశలేదన్నారు. తాను వ్యక్తిగతంగా ఇస్తే ముప్ఫయి కోట్లు ఇస్తానని, అదే అధికారాన్ని తనకు అప్పగిస్తే లక్షలాది కోట్ల రూపాయలను ప్రజలకు పారదర్శకంగా పంచి పెడతానని తెలిపారు. సామాజిక న్యాయాన్ని అమలు చేస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని పవన్ కల్యాణ్ జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.
Next Story