Sun Jan 12 2025 23:29:48 GMT+0000 (Coordinated Universal Time)
ఆ రెండు పార్టీలు బాబు కోసం పుట్టినవే
చంద్రబాబు కోసం పుట్టిన కవలపిల్లల్లో ఒకటి జనసేన, మరొకటి లోక్ సత్తా అని వైసీపీ నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... లోక్ సత్తా అనే పాత బండికి కొత్త డ్రైవర్ వచ్చారని, బండి బయటకు నీలం రంగులో కనిపించినా లోపల మొత్తం పసుపు రంగే ఉంటుందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఈ లోక్ సత్తా ఏమీ మాట్లాడదని, కాల్ మనీ, పార్టీ ఫిరాయింపులు, దోపిడీ, రాజ్యాంగ వ్యవస్థలను మంటగలుపుతున్న తీరు గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఓట్లు చీల్చేందుకే లోక్ సత్తాను వదిలారని ఆరోపించారు. ఓటమి ఎరుగని వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి వంటి నేతను విమర్శించే నైతిక హక్కు పవన్ కళ్యాణ్ కు ఉందా అని ప్రశ్నించారు. వర్షాకాలం వచ్చినప్పుడు పుట్టగొడుగులు వచ్చినట్టుగానే ఎన్నికల వేళ జనసేన, లోక్ సత్తా వంటి పార్టీలు వస్తూనే ఉంటాయని పేర్కొన్నారు.
Next Story