Mon Dec 23 2024 18:17:38 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ ఒక క్లారిటీకి వచ్చారా?
జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఈ నెల 14వ తేదీన జరగనుంది. పవన్ కల్యాణ్ తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఈ నెల 14వ తేదీన జరగనుంది. పవన్ కల్యాణ్ తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జనసేన ఆవిర్భవించి ఎనిమిదో ఏట అడుగు పెడుతోంది. పెద్దయెత్తున ఆవిర్భావ సభను ఏర్పాటు చేసేందుకు జనసేన నేతలు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన నేతలు, ముఖ్య కార్యకర్తలు, అనుబంధ సంఘాల నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ సభలో పొత్తుల విషయంపై పవన్ కల్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశముంది.
పొత్తుపై....
జనసేన పార్టీ వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో పొత్తుతో వెళ్లాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జనసేనతో కలసి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్యాడర్ కు ఒక స్పష్టత ఇస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీతో జనసేన మిత్రపక్షంగా వ్యవహరిస్తుంది. టీడీపీతో కలవడానికి బీజేపీ ఇష్టపడటం లేదు. బీజేపీతో కలసి వెళితే ఈసారి కూడా అనుకున్న ఫలితాలు సాధించలేమని జనసేనాని నమ్ముతున్నారు.
బీజేపీ అంగీకరించినా...?
అందుకే ఈసారి బీజేపీతో కలసి టీడీపీతో నడవాలన్నది పవన్ కల్యాణ్ నిర్ణయంగా ఉంది. ఒకవేళ బీజేపీ అందుకు అంగీకరించకపోతే బీజేపీని వీడి టీడీపీతో జత కట్టేందుకు కూడా సిద్ధమయ్యేందుకు పవన్ ప్లాన్ చేసుకున్నారని తెలిసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వచ్చినా బీజేపీకి ఏపీలో పెద్దగా బలం లేనందున దానితో ఎన్నికలకు వెళ్లి మరోసారి చేతులు కాల్చుకునేందుకు పవన్ కల్యాణ్ సిద్ధంగా లేరు. అందుకే టీడీపీతో సానుకూల ధోరణిని ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ తెలియజేస్తారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.
కాపు ఫోరంపై....
ఇక కాపు సామాజికవర్గం కూడా ఈసారి పవన్ కల్యాణ్ తనకు అండగా నిలబడాలని కోరుకుంటున్నారు. అందుకే కాపు సమస్యలపై కూడా ఆయన స్పందించే అవకాశముంది. ఇప్పటికే కాపు నేతలు విడిగా ఒక ఫోరం పెట్టుకుని వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. వారిని కలుపుకుని పోయేలా పవన్ కల్యాణ్ ప్రసంగం సాగుతుందని అంటున్నారు. ఏపీలో అత్యధికంగా ఉన్న కాపులను ఈసారి పవన్ వదులుకోదల్చుకోలేదు. అందుకే ఈసారి తన ప్రసంగంలో కాపు సమస్యలతో పాటు ఫోరంపై కూడా మాట్లాడతారని అంటున్నారు.
Next Story