బ్రేకింగ్ : సోహ్రాబుద్దిన్ ఎన్ కౌంటర్ కేసులో కీలక తీర్పు
గ్యాంగ్ స్టర్ సోహ్రాబుద్దిన్ ఎన్ కౌంటర్ కేసులో ముంబై సీబీఐ కోర్టు కీలక తీర్పనిచ్చింది. ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు లేనందున 22 మందిని నిర్దోషులుగా కోర్టు తేల్చింది. నిందితులపై అభియోగాలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు వ్యాఖ్యానించింది. 2005లో సోహ్రాబుద్దిన్ తో పాటు ఆయన భార్య కౌసర్ బీ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ నుంచి సాంగ్లీకి బస్సులో వెళుతుండగా సోహ్రాబుద్దిన్, కౌసర్ బీ, ఆయన అనుచరుడు ప్రజాప్రతి అదృశ్యమయ్యారు. తర్వాత కొన్ని రోజులకే గుజరాత్ గాంధీనగర్ సమీపంలో ఎన్ కౌంటర్ లో వీరు మరణించారు. ఇప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గుజరాత్ హోంమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఈ ఘటన పెను సంచలనం సృష్టించింది. నకిలీ ఎన్ కౌంటర్ గా ఆరోపణలు రావడంతో 22 మంది పోలీసులపై కేసు నమోదైంది. ఈ కేసు అమిత్ షాపై కూడా ఆరోపణలు వచ్చినా సీబీఐ ఆయన పాత్ర లేదని తేల్చింది.