Fri Nov 22 2024 11:52:31 GMT+0000 (Coordinated Universal Time)
తేలిగ్గా కొట్టి పారేయలేం... టార్గెట్ టీడీపీయేనా?
జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షా భేటీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడిని కలిగించింది.
జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షా భేటీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడిని కలిగించింది. జూనియర్ ను బీజేపీ భవిష్యత్ లో రాజకీయంగా ఉపయోగించుకోవడానికే ఈ భేటీ జరిగిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. బీజేపీకి తెలంగాణలో జూనియర్ అవసరం పెద్దగా లేకపోవచ్చు. ఆయన అభిమానులు తెలంగాణలో ఉన్నప్పటికీ ఇక్కడ బలపడే అవకాశాలున్నాయి. ఆల్రెడీ కాంగ్రెస్ ను వెనక్కు నెట్టి బీజేపీ ముందుకు వచ్చిందనే ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండక పోవచ్చు. తెలంగాణలో పార్టీకి అదనపు అండగానే జూనియర్ ఉపయోగపడతారు తప్పించి ఆయనే ఇక్కడ ఓట్లు కురిపించడానికి ప్రధాన వ్యక్తిగా మారతారని అనుకోలేం.
నాయకత్వ సమస్య...
కానీ జూనియర్ ఎన్టీఆర్ వల్ల ఆంధ్రప్రదేశ్ లో ప్రయోజనం ఉంటుంది. ప్రధానంగా టీడీపీ బలంగా ఉన్నా ఆ పార్టీ నాయకత్వంపై భవిష్యత్ లో సందేహాలయితే ఉన్నాయి. చంద్రబాబు తర్వాత నారా లోకేష్ తప్ప ఎవరికీ ఛాన్స్ ఉండదన్న విషయం అందరికీ తెలుసు. నారా లోకేష్ ఇంకా రాజకీయంగా రాటు దేలలేదన్నది పార్టీ నేతలే అంగీకరిస్తున్న విషయం. చంద్రబాబుపై ప్రజల్లోనూ, క్యాడర్ లోనూ విశ్వాసం ఉన్నట్లు నారా లోకేష్ పై కన్పించడం లేదు. రాజకీయ అంశాలపై అవగాహన లోపంతో పాటు ఆయన ప్రత్యర్థులపై చేస్తున్న విమర్శలు కూడా పెద్దగా పేలడం లేదు. అందుకే నారా లోకేష్ సారథ్యంలో పార్టీ బలోపేతం అవుతుందని మాత్రం ఇప్పటి వరకూ అయితే ఎవరూ నమ్మడం లేదు. భవిష్యత్ లో ఆయన తండ్రిమాదిరిగా వ్యూహాలను రచించడంలో దిట్ట అవుతారామో కాని ఇప్పటి వరకూ అయితే లోకేష్ ను నాయకుడిగా అంగీకరించని వారే అధికంగా ఉన్నారు.
జూనియర్ ను తీసుకు వచ్చేందుకు...
నందమూరి బాలకృష్ణ ఉన్నా ఆయన ఫుల్ టైం రాజకీయ నేతకాదు. పార్టీ పగ్గాలు కూడా చేపట్టే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలే కనిపిస్తుండటం ఇందుకు ఉదాహరణ. పార్టీ అభిమానులు, కింది స్థాయి క్యాడర్ జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో క్రియాశీలకంగా మారాలని భావిస్తున్నారు. కానీ జూనియర్ మాత్రం తనకు ఇప్పుడే రాజకీయాల్లో రావాలని ఆలోచన చేయడం లేదని చెబుతూ వస్తున్నారు. అలాగని టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయరని కూడా చెప్పలేం. చంద్రబాబు ఇప్పటికే ఎన్టీఆర్ కుటుంబంతో మరింత సఖ్యతగా మెలిగేందుకు సిద్ధమవుతున్నారు. తన చిరకాల ప్రత్యర్థి అయిన దగ్గుబాట ి వెంకటేశ్వరరావును కూడా దువ్వడానికి సిద్ధమయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారంలోకి తీసుకు రావడం ఆయనకో పెద్ద లెక్కకాదన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్.
అందుకే బీజేపీ...
అందుకే ముందుజాగ్రత్తగా బీజేపీ అప్రమత్తమయినట్లు కనపడుతుంది. జూనియర్ కు టీడీపీ నాయకత్వం అప్పగిస్తే ఏ ఇబ్బంది ఉండదు. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకోవచ్చు. జూనియర్ ని టీడీపీ దూరం పెడితే తాము దగ్గరకు తీయాలన్న లక్ష్యంతో ఒక చిన్న పాటి ప్రయత్నం చేసినట్లు కనపడుతుంది. ఎటూ బీజేపీలో జూనియర్ ఎన్టీఆర్ అత్త, ఎన్టీఆర్ కుమార్తె పురంద్రీశ్వరి బీజేపీలో క్రియాశీలంకగా వ్యవహరిస్తున్నారు. ఆమెకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను కూడా అప్పగించాలన్న యోచనలో బీజేపీ నాయకత్వం ఉంది. చంద్రబాబును, ఆయన పార్టీని ఏపీలో డల్ చేయగలిగితే బీజేపీ పుంజుకునే అవకాశాలున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మద్దతిస్తే బీజేపీలో చేరికలు కూడా భారీగా ఉంటాయి. ఒక ప్రధాన సామాజికవర్గం కూడా అండగా నిలిచే అవకాశం ఉంటుంది. ఇక ఆయన ఫ్యాన్స్ సంగతి సరేసరి. ఇన్ని లెక్కలు వేసే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్తో భేటీ అయ్యారంటున్నారు. బీజేపీ వాడుకుంటే ఎవరినైనా మామూలుగా వాడుకోదు. ఆ సంగతి అందరికీ తెలిసిందే. అందుకే జూనియర్ తో జట్టు కట్టేందుకే అమిత్ షా భేటీ అయ్యారన్నది రాజకీయ విశ్లేషకులు అంగీకరిస్తున్న విషయం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Next Story