Tue Nov 26 2024 23:30:19 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు ట్రాప్ లో జగన్ పడినట్లేనా?
2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు జగన్ ట్రాప్ లో పడినట్లే ఇప్పుడు టీడీపీ ట్రాప్ లో వైసీపీ పడుతున్నట్లే కనిపిస్తుంది.
ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబుతో ఏం మాట్లాడారో ఎవరికీ తెలియదు. అతి కొద్ది సేపు మాత్రం ఆయనతో కరచాలనం చేసి మాట్లాడారు. అదీ నిల్చునే మాట్లాడారు. ఈ విషయం తెలిసి వైసీపీ ఫ్రస్టేషన్ కు లోనవుతుంది. చంద్రబాబుతో మోదీ మాట్లాడటమే తప్పుగా అది భావిస్తుంది. దానిని మహా అపరాధంగా చూస్తుంది. అంటే జగన్ పార్టీ చంద్రబాబు ట్రాప్ లో పడినట్లే అనుకోవాల్సి ఉంటుంది. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు జగన్ ట్రాప్ లో చిక్కుకున్నట్లే ఇప్పుడు టీడీపీ ట్రాప్ లో వైసీపీ పడుతున్నట్లే కనిపిస్తుంది.
షేక్ హ్యాండ్ ఇవ్వడమే...
చంద్రబాబుకు మోడీ షేక్ హ్యాండ్ ఇవ్వడమే ఒక పాపంగా, అది ఒక నేరంగా వైసీపీ భావిస్తుంది. జగన్ కు అత్యంత సన్నిహితుడైన సజ్జల రామకృష్ణారెడ్డి ఏకంగా వచ్చే ఎన్నికల్లో మూడు ఎన్నికలు కలిసే అవకాశముందని జోస్యం చెప్పడం ఫ్రస్టేషన్ కాక మరేంటి? సహజంగా సమావేశానికి వచ్చిన ఒక మాజీ ముఖ్యమంత్రిని పలకరించడం సంప్రదాయం. అది ప్రధాని హోదాలో ఏ నేత ఉన్నా వారిని గౌరవించడం ఒక సంప్రదాయం. మొహం ముడుచుకుని వెళ్లిపోయే పరిస్థిితి ఉండదు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అక్కడ ఎదురుగా నిలబడితే సహజంగానే పలకరించడం ఆనవాయితీ. మోదీ అదే చేసి ఉండవచ్చు. లేకుంటే వయసు దృష్ట్యా ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకుని ఉండవచ్చు.
ఉలిక్కిపడటం వెనక?
కానీ దీనికి వైసీపీ ఉలిక్కిపడుతుంది. టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదిరినట్లేనన్న రీతిలో వ్యవహరిస్తుంది. 2014లో మాదిరిగా పొత్తులు కుదురుతాయని చెప్పేస్తుంది. దీనినిబట్టి మోదీ చంద్రబాబు పలకరింపుతో వైసీపీలో ఫ్రస్టేషన్ మొదలయిందనే చెప్పాలి. ఫ్రస్టేషన్ తో బాబు తరహాలోనే బీజేపీకి దూరం చేసుకుంటే చంద్రబాబు దాదాపు మూడేళ్లుగా పడుతున్న శ్రమకు ఫలితం దొరికినట్లే. రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన సీన్ అధికారంలో ఉన్న వైసీపీ నేతల్లో ఒకరకమైన ఏహ్యభావాన్ని కలిగించింది. ఇది ఇప్పుడు కొత్త కాదు. గతంలోనూ జరిగిన విషయాలను కొందరు గుర్తు చేస్తున్నారు. టీడీపీ అనుకూల మీడియా అప్పుడే వైసీపీలో వణుకు ప్రారంభమయిందన్న ప్రచారాన్ని ప్రారంభించింది.
లైట్ గా తీసుకోకుండా?
కరోనా సమయంలో చంద్రబాబు లేఖకు స్పందించిన మోదీ తిరుగు లేఖ రాస్తే అప్పుడు కూడా ఇదే రకమైన ప్రచారం జరిగింది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబుకు మోదీ, షాల అపాయింంట్మెంట్ లభించకపోయినా వెనక్కు వచ్చిన తర్వాత అమిత్ షా ఫోన్ చేసి క్షమాపణలను కోరామన్న వార్తలను చదివాం. దీనిని కూడా అలాంటిదిగానే చూడాల్సిన వైసీపీ ఈ షేక్ హ్యాండ్ ను మాత్రం సీరియస్ గానే తీసుకున్నట్లు కనపడుతుంది. ఆ మరుసటి రోేజు అదే ఢిల్లీలో జగన్ ను మోదీ ప్రేమపూర్వకంగా పలకరించడమే కాదు, ఆయనతో కలసి లంచ్ చేయడాన్ని కూడా విస్మరిస్తూ చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ప్రచారాన్ని నమ్మి కొంత వైసీపీ స్పీడ్ అయిందనే చెప్పాలి. బీజేపీతో నేరుగా పొత్తు లేకున్నా వైసీపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సత్సంబంధాలను చెడగొట్టుకుంటే చంద్రబాబు ట్రాప్ లో వైసీపీ పడినట్లే అనుకోవాలి. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి
Next Story