Fri Nov 22 2024 23:41:47 GMT+0000 (Coordinated Universal Time)
జేడీఎస్ జోలికి పోరా?
కర్ణాటక ఎన్నికల ఫలితాలు రేపు రానున్నాయి. దేశమంతటా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు రేపు రానున్నాయి. దేశమంతటా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. దక్షిణ భారత దేశంలో బీజేపీ బలంగా ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కర్ణాటకలో ఎవరిది అధికారమన్నది మరి కొద్ది గంటల్లోనే స్పష్టత రానుంది. అయితే ఈ సమయంలో జనతాదళ్ ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. భజరంగబలి నినాదం వర్క్ అవుట్ అయితే మాత్రం కాంగ్రెస్కు ఎగ్జిట్ పోల్స్లో చెప్పినన్ని సీట్లు రాకపోవచ్చన్న వాదన కూడా వినిపిస్తుంది. ప్రస్తుతం సింగపూర్లో జేడీఎస్ అధినేత కుమారస్వామి విశ్రాంతితీసుకుంటున్నారు.
అంచనాలు ఈసారి...
ఈసారి ఖచ్చితంగా బీజేపీ కాని, కాంగ్రెస్ కాని తనను ముఖ్యమంత్రి పదవి ఇచ్చి అందులో కూర్చోబెడతారని జేడీఎస్ అధినేత కుమారస్వామి ఉన్నారు. కానీ ఎన్నికలు జరిగిన తీరును చూసి కుమారస్వామిలో కూడా ఆ ఆశలు సన్నగిల్లాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా కుమారస్వామికి అనవసర ప్రాధాన్యత ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాయి. గెలిచిన స్థానాల సంఖ్యను బట్టి ఈసారి ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. పొత్తుకు కుమారస్వామి మాత్రమే ముందుకు రావాలని బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలూ కోరుకుంటున్నాయి.
అవసరమైతే...
అలా ఎన్నికల ఫలితాల అనంతరం పొత్తుకు ముందుకు వస్తే ముఖ్యమంత్రి పదవి మినహాయించి మంత్రివర్గంలో జేడీఎస్ సభ్యులకు కొందరికి అవకాశం ఇచ్చేందుకు వీలుందని అంటున్నారు. అంతే తప్ప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఆయనను నెత్తిమీద పెట్టుకోవాలని మాత్రం రెండు ప్రధాన పార్టీలు ఆలోచన చేయడం లేదు. అవసరమైతే ఏ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా అలాగే ఉంచేలా బీజేపీ చర్యలు తీసుకుంటుంది తప్ప కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం లేదని అంటున్నారు. అందుకే పెద్దగా కుమారస్వామి గురించి కమలం పార్టీ ఆలోచించడం లేదన్నది బీజేపీ నేతల మాటల్లో అర్థమవుతుంది.
కాంగ్రెస్ కూడా...
ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అదే తరహా యోచనలో ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉండాలనుకుంటే జేడీఎస్ తమ ప్రభుత్వంలో భాగస్వామి కావడం తప్ప ముఖ్యమంత్రి పదవి మాత్రం ఇచ్చేది లేదంటుంది. అందుకు అంగీకారం అయితే తనంతట తానుగా పొత్తుకు ముందుకు వస్తే జేడీఎస్ ను కాంగ్రెస్ కలుపుకుని పోతుంది తప్ప.. ఫలితాలు వెల్లడవుతుండగానే హడావిడిగా కుమారస్వామి వద్దకు పరుగులు తీసే యోచనలో అయితే కాంగ్రెస్ పార్టీ లేదు. ఇప్పటికే కుమారస్వామి అటు బీజేపీతోనూ, ఇటు కాంగ్రెస్తోనూ పొత్తులు కుదుర్చుకుని ముఖ్యమంత్రి కాగలిగారు. ఇకపై మాత్రం ఆ ఛాన్స్ లేదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. దీంతో జేడీఎస్ వచ్చే ఎన్నికల నాటికి అది ఏ పరిస్థితుల్లో ఉంచాలన్నది కుమారస్వామి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందంటున్నారు.
Next Story