Thu Nov 14 2024 10:12:36 GMT+0000 (Coordinated Universal Time)
సిద్ధూ నువ్వు సూపరహే..!
కర్ణాటక ఎన్నికలు మరో రెండు రోజుల్లో జరగనున్నాయి. ఈ ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
కర్ణాటక ఎన్నికలు మరో రెండు రోజుల్లో జరగనున్నాయి. ఈ ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. అన్ని సర్వేలు మాత్రం కాంగ్రెస్‌కే అనుకూలంగా చెబుతున్నాయి. తక్కువ సీట్లతోనైనా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని మెజారిటీ సంస్థలు చెబుతుండగా, హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని కొన్ని సంస్థలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్నారని కొంత సర్వేల ద్వారా తెలుస్తుంది. అందుకే ప్రధాని మోదీ కర్ణాటకలోనే మకాం వేసి మరీ ప్రచారాన్ని చేశారు. దక్షిణ భారత దేశంలో అధికారంలోకి రాగలిగిన ఏకైక రాష్ట్రం కర్ణాటక కావడంతో బీజేపీ అన్ని శక్తులు మొహరించింది. హనుమాన్ మంత్రం ఎంత వరకూ పనిచేస్తుందన్నది చూడాలి.
ఆయనపైనే...
ఇక కాంగ్రెస్ పూర్తిగా సిద్ధరామయ్య పైనే ఆధారపడి ఉంది. సిద్ధరామయ్యను అన్ని ప్రాంతాల ప్రజలు ఇష్టపడుతున్నారని సర్వేల్లో వెల్లడయింది. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య అయితే బెటర్ అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నట్లు కూడా సర్వే నివేదికలు తేల్చాయి. నిజానికి పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అగ్రనేతగా ఉన్నప్పటికీ, ఆయన అత్యంత ధనవంతుడు కావడం, వివిధ కేసుల్లో ఉండటంతో ఆయన కంటే సిద్ధరామయ్య బెటర్ అని ప్రజలు నమ్ముతున్నారని వివిధ సర్వే నివేదికలు వెల్లడించాయి. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కూడా సిద్ధరామయ్యకు ఉంది.
ఐదేళ్ల పాటు పార్టీని...
ఐదేళ్ల పాటు పార్టీని అధికారంలో ఉంచగలిగారు. అందుకే సిద్ధరామయ్య నాయకత్వంపై అధినాయకత్వం కూడా నమ్మకంగా ఉందని చెబుతున్నారు. సిద్ధరామయ్య సమర్థతను అందరూ అంగీకరిస్తున్నారు. అందరితో కలసి పోవడం, అందుబాటులో ఉండటం సిద్ధరామయ్య ప్రత్యేకత. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా 42 శాతం మంది ప్రజలు కోరుకుంటుండగా, ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్‌ను కేవలం 24 శాతం మంది మాత్రమే సీఎంగా కోరుకుంటున్నారు. ఇక కుమారస్వామికి పదిహేడు శాతం మంది, యడ్యూరప్పను 14 శాతం మంది, డీకే శివకుమార్ ను మూడు శాతం మంది మాత్రమే మద్దతు పలికారని సౌత్ ఫస్ట్ పీపుల్స్ పల్స్ ప్రీపోల్ సర్వేలో వెల్లడించింది.
సిద్ధూకు అనుకూలంగానే...
దీనికి తోడు తొలి నుంచి సిద్ధరామయ్య చెప్పినట్లే కాంగ్రెస్ హైకమాండ్ నడుచుకుంటుంది. గతంలో జేడీఎస్‌తో కలసి అధికారాన్ని ఏర్పాటు చేసినా నాయకత్వ లేమితోనే ఎక్కువ మంది బీజేపీలోకి వెళ్లడంతో ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక కూడా ఆచి తూచి చేసింది. అంతే కాదు కాంగ్రెస్ మ్యానిఫేస్టో కూడా ప్రజలను ఆకట్టుకుంటుంది. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం పార్టీలో ఇప్పటికే ఊపందుకుంది. సోనియా నుంచి రాహుల్ వరకూ అందరూ సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపుతుండటం, పార్టీ జరిపించిన సర్వేల్లోనూ సిద్ధరామయ్య వైపు అనుకూలంగా అందరూ అభిప్రాయాలు చెప్పడంతో ఆయనే ముఖ్యమంత్రి అవుతారని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయి? ఎవరు ముఖ్యమంత్రి అన్నది మే 13న మాత్రమే తెలియనుంది.
Next Story