Mon Dec 23 2024 14:37:00 GMT+0000 (Coordinated Universal Time)
గుండెపోటుతో మంత్రి హఠాన్మరణం.. సీఎం దిగ్భ్రాంతి
మంత్రి ఉమేశ్ కత్తి హఠాన్మరణం విషయం తెలిసి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై షాకయ్యారు. అనుభవజ్ఞుడైన డైనమిక్ లీడర్ ను..
కర్ణాటక మంత్రి ఉమేశ్ కత్తి(61) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. కర్ణాటక ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న ఉమేష్ కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బెంగళూరులోని డాలర్ కాలనీలో నివసిస్తున్న ఆయన నిన్న బాత్రూమ్ లో కాలుజారి కిందపడి గుండెపోటుకు గురయ్యారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు.. వెంటనే నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆయన పల్స్ ఆగిపోయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని రెవెన్యూ మంత్రి ఆర్ అశోక వెల్లడించారు. మంత్రి ఉమేశ్ మరణం బీజేపీకి తీరని లోటన్నారు.
మంత్రి ఉమేశ్ కత్తి హఠాన్మరణం విషయం తెలిసి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై షాకయ్యారు. అనుభవజ్ఞుడైన డైనమిక్ లీడర్ ను కోల్పోయామని సీఎం ఆవేదన చెందారు. ఉమేశ్ మరణం తీవ్ర తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఉమేశ్ మృతి వార్త తెలిసిన వెంటనే ఆయన కేబినెట్ సహచరులు గోవింద్ కర్జోల్, కె.సుధాకర్ సహా పలువురు బీజేపీ నేతలు ఆసుపత్రికి చేరుకున్నారు.
కాగా.. ఉమేశ్ కత్తి బెల్గావి జిల్లా హుక్కేరి తాలూకీ బెల్లాబ్ బాగేవాడిలో జన్మించారు. 1985లో ఆయన తండ్రి విశ్వనాథ్ కత్తి మరణం తర్వాత ఉమేశ్ రాజకీయాల్లోకి వచ్చారు. హుక్కేరి నుంచి 8 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. గతంలో జేహెచ్ పటేల్, బీఎస్ యడియూరప్ప, డీవీ సదానంద గౌడ, జగదీశ్ షెట్టార్ నేతృత్వంలోని ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు.
Next Story