వంద సీట్లు మావే...గ్యారంటీ..?
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరపక్వత తెచ్చుకోవాలని, ఎవరో రాసిస్తే చదవడం మానుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు విమర్శించారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘బీజేపీ ప్రభుత్వం మాటలు తీయగా ఉన్నా చేతలు మాత్రం జరగడం లేదు. రాహుల్ గాంధీ చెప్పినట్లు తాము అందరికీ డబుల్ బెడ్రూం ఇస్తామని, 22 లక్షల ఇళ్లు ఇస్తామని తాము చెప్పలేదు. రెండున్నర లక్షలు మాత్రమే ఇస్తామన్నాము, ఇప్పటికే నిర్మిస్తున్నామని కావాలంటే హైదరాబాద్ లోనే చూపిస్తాం. కుటుంబపాలన కోసం రాహుల్ గాంధీ మాట్లాడటమా..? ఢిల్లీ కుటుంబపాలనతో పోలిస్తే మా కుటుంబపాలన బెటరే. ఢిల్లీకి బానిసలుగా ఉండేందుకు తెలుగు ప్రజలు సిద్ధంగా లేరు. ఎన్టీఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీని వ్యతిరేకించిన చరిత్ర తెలుగు ప్రజలదే. టిక్కెట్లు ఇచ్చేందుకైనా పీసీసీకి అధికారం లేదు. ఢిల్లీ నుంచే టిక్కెట్లు ఇవ్వాలి.
100 సీట్లు వస్తాయి..
వ్యతిరేక పక్షాలకు రాహుల్ ఒక బలంగా మారుతుండటం నిజంగానే అనిపిస్తోంది. రాహుల్ గాంధీకి కేసీఆర్ బయపడతాడా..? రాహుల్ ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. కావాలంటే హైదరాబాద్ కేంద్రంగా దక్షిణ భారతదేశం మొత్తం ప్రచారం చేసుకోవచ్చు. ఆరేడు సర్వేలు చేయించాం. కచ్చితంగా 100కి పైగా స్థానాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది. రైతు రుణమాఫీ విడతలవారీగానే చేయగలం. ఒక్కసారి చేయడం సాధ్యం కాదు. కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన ప్రభుత్వం. ఏకకాలంలో రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి మోసపు హామీలు కాంగ్రెస్ ఇస్తోంది. కాంగ్రెస్ ఒక్కరాష్ట్రంలో 20 సీట్లు గెలుస్తామని చెప్పగలదా..? మేము తెలంగాణలో అన్ని సీట్లు గెలుస్తాం.
కార్యవర్గ సమావేశంలో రాజకీయ నిర్ణయాలు
- వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనే ఒంటరిగా పోటీ చేస్తుంది. పొత్తులు ఉండవు.
- సెప్టెంబర్ 2వ తేదీన హైదరాబాద్ లో రాష్ట్ర చరిత్రలోనే జరగని విధంగా భారీ ప్రగతి నివేదన సభ. టీఆర్ఎస్ చేసిన కార్యక్రమాలన్నీ అందులో చెబుతాం. శామీర్ పేట లేదా శంషాబాద్, బౌరంపేటలో సభ ఉంటుంది.
- ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరినీ సెప్టెంబర్ లోనే ప్రకటిస్తాం. అభ్యర్థుల ఎంపికకు సర్వే, స్ర్కీనింగ్ ఉంటుంది. మూడు నియోజకవర్గాలకు ఒక పార్టీ కార్యదర్శికి బాధ్యతలు అప్పగిస్తున్నాం.
కార్యవర్గ సమావేశంలో తీసుకున్న ఇతర నిర్ణయాలు
- విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలుచేసి విభజన ప్రక్రియను సంపూర్ణంగా పూర్తి చేయాలి.
- కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకున్న కనీసం రూ.20 వేల కోట్లు నిధులు ఇవ్వాలి.
- వరి దాన్యం, మొక్కజొన్నకు క్వింటాలుకు రెండు వేల చొప్పున కనీస మద్దతు ధర ఇవ్వాలి.
- నరేగా కార్యకరమాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి.
- ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కేంద్రం వద్ద ఉంచుకుని కాలయాపన చేస్తున్నారు.
- ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు విషయంలో తమిళనాడులా 9వ షెడ్యూల్ లో చేర్చి అవకాశం కల్పించాలి.
- 50 శాతానికి పైగా ఉన్న బీసీ వర్గాల సంక్షేమం కోసం కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలి.
- బీసీలు, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి. ఈ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అవసరమైతే పార్లమెంట్ సీట్ల సంఖ్య పెంచాలి.
- ఫెడరల్ స్ఫూర్తి పెంపొందించాలి. మోదీ ప్రభుత్వం గొప్పగా తెచ్చిన నీతి అయోగ్ పేరు గొప్ప.. ఊరు దిబ్బగా మారింది. దీనిద్వారా ఎటువంటి ప్రయోజనం కలగలేదు. రాష్ట్రాలను మున్సిపాలిటీల కింద మారుస్తున్నారు. అధికారాలు కేంద్రం చేతిలోనే ఉంచుకుంటుంది. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లయినా ఇంకా కేంద్ర, రాష్ట్రాల అధికారాలపై సమీక్ష జరపడం లేదు.
- విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖలు రాష్ట్రాలకే ఇవ్వాలి.