Wed Nov 27 2024 09:56:28 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్ని రోజులు పడుతుంది? అసలు సాధ్యమా?
కేసీఆర్ మంచి వ్యూహకర్తే కావచ్చు. దేశ ప్రయోజనాల పట్ల ఆకాంక్షలు ఉండవచ్చు. దేశ సమస్యలపై అవగాహన ఉందన్నది ఎవరూ కాదనలేరు.
కేసీఆర్ మంచి వ్యూహకర్తే కావచ్చు. దేశ ప్రయోజనాల పట్ల ఆకాంక్షలు ఉండవచ్చు. దేశ సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉందన్నది ఎవరూ కాదనలేరు. ఎందుకంటే అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. రక్తపు బొట్టు చిందించకుండా రాష్ట్రాన్ని సాధించారు. ఆయన తెలంగాణ చరిత్రలో నిలిచిపోతారు. ఆయన ఇప్పటి వరకూ ఫెయిల్యూర్ లీడర్ గా ముద్రపడలేదు. వరసగా రెండుసార్లు తెలంగాణలో టీఆర్ఎస్ ను ఒంటిచేత్తో అధికారంలోకి తేగలిగారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పినా రెండోసారి జనం ఆయనను ఆదరించారంటే ఆయన స్ట్రాటజీలు ఎవరికీ అర్థం కావు.
వ్యూహం ఏంటి?
ఇప్పుడు భారత రాష్ట్ర సమితి పేరు పెట్టడం వెనక కూడా కేసీఆర్ వ్యూహం ఏదో దాగి ఉంటుందని అనుకుంటున్నారు తప్ప ఎవరికీ అర్థం కాకుండా ఉంది. టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల్లో ఒకటిగా ఉంది. టీఆర్ఎస్ అంటే తెలియని వారు లేరు. రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంతం ప్రజల్లో ఆ పేరు నానుతోంది. టీఆర్ఎస్ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే టీఆర్ఎస్ గా మారింది. అలాంటిది ఒక్కసారి పేరు మార్చడం వెనక ఆయన ఆలోచన ఏంటన్నది సస్పెన్స్ గానే ఉంది. బీఆర్ఎస్ పేరు ప్రకటించిన తర్వాత కొందరు మంత్రుల నోళ్లకే అది ఎక్కలేదంటే ప్రజల్లోకి వెళ్లాలంటే ఇంకెంత సమయం పడుతుందన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి.
లోక్ సభ స్థానాలతో....
తెలంగాణలో పదిహేడు లోక్ సభ స్థానాలున్నాయి. అందులో హైదరాబాద్ ను వదిలేయాలి. అది ఎంఐఎం కు దాదాపు వదిలేసినట్లే. ఇక టీఆర్ఎస్ సొంతంగా గెలుచుకునే స్థానాలు ఎన్ని? ఇన్ని తక్కువ స్థానాలను పెట్టుకుని జాతీయ రాజకీయాలను కేసీఆర్ ఎలా శాసిస్తారు? ఉత్తర భారతంలో అతి పెద్ద పార్టీలు అనేకం ఉన్నాయి. అవి కూడా ప్రాంతీయ పార్టీలే. సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్, శివసేన వంటి పార్టీలు టీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాలను లోక్ సభలో కలిగి ఉంటాయి. అంతెందుకు దక్షిణాదిన ఉన్న డీఎంకేకు ఉన్న స్థానాల్లో మూడో వంతు స్థానాలు కూడా టీఆర్ఎస్ కు లేవు. అంతెందుకు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ లో వైసీీపీకి 22 ఎంపీ స్థానాలుంటే ఇక్కడ టీఆర్ఎస్ స్థానాలు రెండంకెలు దాటలేదు.
ఇటు వైపు చూస్తారా?
అలాంటప్పుడు దక్షిణాది ఉన్న ఒక చిన్న ప్రాంతీయ పార్టీ వైపు ఉత్తరాది పార్టీలు చూస్తాయా? పేరు మార్చినంత మాత్రాన బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల్లో ఏ మేరకు సక్సెస్ అవుతుంది. పొరుగున ఉన్న రాష్ట్రాల ప్రజలే ఆదరిస్తారా? పథకాలను చూసి ప్రజలు ఓటేస్తారా? ఆ పథకాలు తమకు వస్తాయని అనుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేయ్యాలి. తెలంగాణ మోడల్ అంటే ఆదరిస్తారా? పార్లమెంటు ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేసే శక్తి సామర్థ్యం ఉన్నాయా? అంటే ఇవన్నీ ఊహాజనితమే. ఎటూ తేలని ప్రశ్నలు. దక్షిణాది రాష్ట్రాల నేతలను ఉత్తరాది నేతలు ఎదగనివ్వరు. చిన్న రాష్ట్రం గురించి ఎవరు పట్టించుకుంటారు? ఎందుకు కేసీఆర్ ఈ సాహసం చేశారు? టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు? ఇవన్నీ ఇప్పుడు కిందిస్థాయి నేతల నుంచి అగ్రస్థాయి నేతల వరకూ ఎదురవుతున్న ప్రశ్నలు. వీటికి సమాధానం మాత్రం ఇప్పుడప్పుడే దొరకదు.
Next Story