గెలుపు ఖాయం... లక్ష మెజారిటీ కావాలి
రాష్ట్రంలో రైతులు దేశంలో ధనవంతులుగా ఉండేలా కార్యక్రమాలు చేపడతామని తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మంగళవారం సిద్ధిపేటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ... తాను కూడా రైతు బిడ్డనే అని రైతుల కష్టాలు తనకు తెలుసన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. మన ప్రజలు మనవద్ద పండే ఆహారమే తినేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. వ్యవసాయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉంటుందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక కుంభకోణాలు, పేకాట క్లబ్బులు, గుడుంబా బట్టీలు లేవని పేర్కొన్నారు. ఐకేపీ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని, రేషన్ డీలర్ల ఆదాయాన్ని పెంచుతామని, రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ వేతనం అందిస్తాని ప్రకటించారు. హరీష్ రావు, రామలింగారెడ్డి కచ్చితంగా గెలుస్తారని, కానీ లక్ష ఓట్ల మెజారిటీ రావాలని పేర్కొన్నారు.