Mon Dec 23 2024 02:33:38 GMT+0000 (Coordinated Universal Time)
కయ్యం అందుకేనట.. తర్వాత వియ్యమేనట
కేసీఆర్ ఈసారి బీజేపీని టార్గెట్ చేసుకున్నారు. మోదీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ కు, తెలంగాణకు రాజకీయంగా చాలా తేడా ఉంది. ఏపీలో కుల రాజకీయాలు ఎక్కువ ప్రభావం చూపుతాయి. కానీ తెలంగాణ ప్రజలు రాజకీయ చైతన్యం కలిగి ఉంటారు. కులాలు కన్నా ఎక్కువగా సమగ్ర అభివృద్ధి వైపే మొగ్గు చూపుతారు. దశాబ్దాల పాటు నిజాం పాలనలోనూ, పట్వారీ వ్యవస్థతోనూ నలిగి ఉన్న తెలంగాణ ప్రజల్లో రాజకీయ అవగాహన ఎక్కువగానే ఉంటుంది. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను కాదని రాష్ట్రాన్ని తెచ్చారన్న నమ్మకంతోనే కేసీఆర్ కు రెండు దఫాలు అండగా నిలిచారు.
బీజేపీని టార్గెట్ చేసుకుని...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకే ఈసారి బీజేపీని టార్గెట్ చేసుకున్నారు. మోదీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తొలి రెండు దఫాలు తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్ తో ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ ఈసారి బీజేపీని ముందు పెట్టి ఎన్నికలకు వెళుతున్నారు. బీజేపీ మతతత్వ పార్టీ మాత్రమే కాకుండా, అధికారంలోకి వస్తే మతకలహాలు మరింత పెరిగే అవకాశముందన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పిస్తున్నారు.
ప్రజల్లో ఉన్న వ్యతిరేకత...
దీంతో పాటు నిత్యావసరాలు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడంపై కూడా కేంద్ర ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఏపీ ప్రజలు పెద్దగా పట్టించుకోరు. అందుకే అక్కడ అన్ని పార్టీలూ బీజేపీ తోడు కోసం తహతహలాడుతుంటాయి. కానీ తెలంగాణలో మాత్రం డిఫరెంట్ గా ప్రజలు ఆలోచిస్తారు. రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవవచ్చు. నాలుగు పార్లమెంటు స్థానాల్లో బీజేపీ విజయం సాధించవచ్చు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గణనీయంగా వార్డు స్థానాలను గెలుచుకోవచ్చు. కానీ అది ప్రత్యేక పరిస్థితుల కారణంగానే చూడాల్సి ఉంటుంది.
ఎన్నికల అనంతరం...
కానీ శాసనసభ ఎన్నికలు వచ్చే సరికి ప్రజల ఆలోచన వేరుగా ఉంటుందని కేసీఆర్ భావన. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందన్న ఆలోచనను కేసీఆర్ ప్రజల్లోకి ముందు ముందు బలంగా తీసుకెళ్లనున్నారు. బీజేపీ, కాంగ్రెస్ వల్ల రాష్ట్రం మరింత వెనకబడి పోతుందని ప్రజలు నమ్మేలా చేయాలన్నది కేసీఆర్ వ్యూహంగా ఉంది. కాంగ్రెస్ వస్తే గ్రూపులతోనూ, బీజేపీ వస్తే ఢిల్లీ ఆదేశాలతో రాష్ట్రాభివృద్ధి వెనక్కు పోతుందన్న నినాదంతోనే రానున్న ఎన్నికలకు కేసీఆర్ వెళ్లనున్నారు. అందుకే బీజేపీని టార్గెట్ చేసుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నా లెక్క చేయడంలేదు. శాసనసభ ఎన్నికల తర్వాత తిరిగి కేసీఆర్ బీజేపీకి దగ్గరయినా కావచ్చు. దానిని కాదనలేం. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి కొంత మైలేజీ ఇచ్చి, కాంగ్రెస్,బీజేపీ ఓట్లు చీల్చుకుంటే మూడోసారి ముఖ్యమంత్రి అవ్వాలన్న యోచనలో ఉన్నారు.
Next Story