Mon Dec 23 2024 10:20:43 GMT+0000 (Coordinated Universal Time)
అన్ని రాష్టాల్లో షిండేలను సృష్టిస్తారా?
దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట ఏక్నాథ్ షిండే లు వస్తారని ఎలా చెబుతారని కేసీఆర్ ప్రశ్నించారు.
దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట ఏక్నాథ్ షిండే లు వస్తారని ఎలా చెబుతారని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రతి రాష్ట్రంలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తారా? అని నిలదీశారు. ఇతర పార్టీల ప్రభుత్వాలను కూలగొట్టడమే మీ రాజకీయమా? అని అన్నారు. దమ్ముంటే షిండేలను తెలంగాణకు, తమిళనాడుకు తీసుకురావాలని మోదీకి సవాల్ విసిరారు. మీడియా సమావేశంలో బీజేపీ పై నిప్పులు చెరిగారు. బీజేపీ రాజకీయ విలువలు లేవని అన్నారు. నుపుర్‌శర్మ విషయంలో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పుపై కొందరిని తీసుకొచ్చి న్యాయమూర్తులను ట్రెండింగ్ చేస్తారా? అని నిలదీశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు తాను హేట్సాఫ్ చెబుతున్నానని, దేశాన్ని కాపాడాలని కోరారు. బీజేపీకి కళ్లు నెత్తికెక్యాయని చెప్పారు. నుపుర్ శర్మ వ్యాఖ్యలను అందరూ ఖండించాలన్నారు.
బీజేపీ ఉన్మాదం అన్ లిమిటెడ్...
ఇందిరాగాంధీ నేరుగా ఎమెర్జెన్సీని ప్రకటిస్తే, బీజేపీ ప్రభుత్వం అనధికార ఎమర్జెన్సీని ప్రకటించిందన్నారు. చట్టాలను, ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం లేదన్నారు. బీజేపీకి ఇంత అహంకారం ఎందుకని కేసీఆర్ ప్రశ్నించారు. ఏక్నాథ్ షిండేలు, కట్టప్పలు పేరు చెప్పి ప్రభుత్వాన్ని పడగొడతామని బెదిరిస్తారా? అని హెచ్చరించారు. మహారాష్ట్రలో సీఎం అయిన ఏక్నాథ్ షిండే నిన్న 20 శాతం విద్యుత్తు ఛార్జీలు పెంచారన్నారు. కట్టప్ప, కాకరకాయలు తమను ఏం చేయలేరన్నారు. జర్నలిస్టులను, జడ్జీలను కూడా ఈ బీజేపీ నేతలు వదలరన్నారు. అన్ని వర్గాలను లోబర్చుకునేందుకు బెదిరింపులకు దిగుతుందన్నారు.
దించి విచారణ జరిపిస్తాం...
బీజేపీ ఉన్మాదం అన్ లిమిటెడ్ అని అన్నారు. రైతుల్ని ఉగ్రవాదులు అని తర్వాత క్షమాపణలు చెప్పారన్నారు. బ్యాంకుల కుంభకోణంలో మోదీ హయాంలో జరగాయన్నారు. నిందితులందరినీ రక్షిస్తున్నారన్నారు. నిరర్థక ఆస్తుల విలువ మోదీ ప్రధాని కాక ముందు నాలుగు లక్షల కోట్లు ఉండగా తర్వాత 12 లక్షల కోట్లు ఈ ప్రభుత్వం ఎన్పీఏ కింద చెల్లించిందన్నారు. బ్యాంకు దొంగలతో కుమ్మక్కయ్యారని కేీకేసీఆర్ ఆరోపించారు. అన్ని సబ్సిడీలు ఎత్తివేస్తూ బ్యాంకులకు మాత్రం దోచి పెడుతున్నారని కేసీఆర్ విమర్శించారు. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంచిందన్నారు. ఇంతవరకూ ఒక్క బ్యాంకు దొంగను కూడా పట్టుకురాలేకపోయారన్నారు. దేశంలో వంద సంవత్సరాలకు నిలబడే బొగ్గునిల్వలున్నా కుంభకోణానికి ఈ కేంద్ర ప్రభుత్వం పాల్పడిందన్నారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించి మోదీ ప్రభుత్వ కుంభకోణాలపై విచారణ జరిపిస్తామన్నారు.
వెంటాడి.. వేటాడి సీబీఐ, ఈడీలతో...
లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు తరలిపోతున్నాయని కేసీఆర్ అన్నారు. విదేశీమారక నిల్వలు తరగిపోతున్నాయన్నారు. అనేక పరిశ్రమలు విదేశాలకు తరలిపోయాయన్నారు. కొత్త పరిశ్రమలు రావడం లేదన్నారు. గుప్పెడు మంది పారిశ్రామికవేత్తలకు మోదీ సేల్స్‌మెన్ గా పనిచేశారన్నారు. మేక్ ఇన్ ఇండియా అట్టర్ ప్లాప్ అని అన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు సుజనా చౌదరి లాంటి వాళ్లకు సీబీఐ నోటీసులు అందాయని, బీజేపీ లో చేరిన తర్వాత ఆగిపోయాయని కేసీఆర్ అన్నారు. వ్యాపారవేత్తలను, రాజకీయనాయకులను వెంటాడి సీబీఐ, ఈడీ సంస్థలతో వేధిస్తున్నారన్నారు. ఏ మూర్ఖుడూ చేయని పనిని ఈ ప్రధాని చేస్తున్నారన్నారు. రాష్ట్రాల ప్రగతిని దెబ్బతీస్తూ దేశాన్ని దెబ్బతీస్తున్నారన్నారు. దేశం మీద కనీసం ప్రేమ ఉన్న ఏ ప్రధాని కూడా అగ్నిపథ్ పథకాన్ని తీసుకురారని చెప్పారు. ప్రయోగాలు చేసే పరిస్థితి కాదన్నారు. చైనా సరిహద్దు ప్రయోగశాల కాదని మాజీ సైనికాధికారులు తనతో చెప్పారన్నారు.
ఎల్ఐసీని అమ్మనివ్వం...
సేవ్ ఇండియా - కిక్ అవుట్ బీజేపీ నినాదం రావాలన్నారు. యువకులు, విద్యావంతులు ముందుకు రావాలని కేసీఆర్ అన్నారు. జాతీయ రాజకీయాలను చేస్తామని ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం డొల్లతనం బయటకు రాగానే డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారన్నారు. మోదీ ప్రాతినిధ్యం వహించే వారణాసిలో ఆయన కట్టించిన ఆలయం ప్రధాన గోపురం కుప్పకూలిపోయిందన్నారు. గోపురాన్ని నట్టు, బోల్టులతో నాసిరకంగా కట్టారన్నారు. ఎల్ఐసీని ఎట్టి పరిస్థితుల్లో అమ్మనీయమన్నారు. శ్రీలంకలో పారిశ్రామికవేత్తకు విద్యుత్తు ప్రాజెక్టు కోసం పైరవీ చేశారన్నారు. అంతర్జాతీయంగా భారత పరువు ప్రతిష్టలను దిగజారుస్తున్నారన్నారు. చెడు మీద పోరాటం కావాల్సిందేనని చెప్పారు. వీరిపాలన కొనసాగితే భారత్ వందేళ్లు వెనక్కు పోతుందని కేసీఆర్ అన్నారు. విభజనల హామీలు నెరవేర్చకున్నా ఎనిమిదేళ్లు మౌనం పాటించానని చెప్పారు. 75 సంవత్సరాల్లో కాంగ్రెస్, బీజేపీ బ్లేమ్ గేమ్ ఆడుతున్నాయన్నారు. అవసరమైతే జాతీయ పార్టీగా మారుతుందని చెప్పారు. కొత్త పార్టీ దేశానికి అవసరం లేదా? అని ఆయన ప్రశ్నించారు. మీరు నాతో గోక్కున్నా, గోక్కోకపోయినా నేను మాత్రం గోకుతూనే ఉంటానని చెప్పారు.
Next Story