Wed Jan 15 2025 09:34:38 GMT+0000 (Coordinated Universal Time)
డబుల్ ఇంజిన్ కావాలి.. ఢిల్లీ ఇంజిన్ మారాలి
దేశంలో అసమర్థ పాలన కొనసాగిస్తున్న నరేంద్ర మోదీ ఈ ఎనిమిదేళ్లలో దేశానికి చేసిందేమీ లేదని కేసీఆర్ అన్నారు
దేశంలో అసమర్థ పాలన కొనసాగిస్తున్న నరేంద్ర మోదీ ఈ ఎనిమిదేళ్లలో దేశానికి చేసిందేమీ లేదన్నారు. హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకున్న బీజేపీ ప్రజలకు ఉపయోగపడే ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదన్నారు. దేశాన్ని బీజేపీ జలగల్లా పట్టి పీడిస్తుందన్నారు. దేశమంతా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూశారన్నారు. కానీ సున్నా అని అన్నారు. తెలంగాణకు వారు చేసిందేమీ లేదన్నారు. తాను వేసిన 9 ప్రశ్నలకు నరేంద్ర మోదీ సమాధానం చెప్పలేదన్నారు. ఆ సమావేశాలు నిరుత్సాహపరిచాయన్నారు.
రూపాయి పతనానికి?
రూపాయి పతనమవ్వడానికి గల కారణమేంటని కేసీఆర్ ప్రశ్నించారు. రూపాయి విలువ 80 రూపాయలకు చేరుకోవడానికి మోదీ సమాధానం చెప్పాలన్నారు. కరెన్సీ విలువ భారత్ లోనే ఎందుకు పతనమవుతుందన్నారు. ఎనిమిదేళ్ల పాలనలో దేశానికి చేసిన ఒక్క మంచి పని చెప్పాలని కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో మంచి నీటి కొరతను కూడా తీర్చలేకపోయిందని, దేశ రాజధానిలోనే మంచినీటి సమస్య ఉందన్నారు. చెత్త విద్యుత్తు విధానం వల్ల దేశ రాజధానిలో విద్యుత్ కోతలు అమలవుతున్నాయన్నారు. భారత తలసరి ఆదాయం 1,49,848 అని, తెలంగాణలో 2,78,333 రూపాయలుఉందని ఆయన అన్నారు. ఇక్కడకు వచ్చి తెలంగాణను నిందించిపోతారా? అని కేసీఆర్ నిలదీశారు. ఏడాదికి కోటి 30 లక్షల మంది ఉపాధి కోల్పోతున్నారన్నారు.
అసమర్థ పాలనతో...
కేంద్ర ప్రభుత్వం అసమర్థ పాలన వల్ల తెలంగాణ మూడు లక్షల కోట్లు నష్పపోయిందని కేసీఆర్ తెలిపారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని మారుస్తామని, చేతకాని ప్రభుత్వాన్ని ఎవరుంచుకుంటారని ఆయన ప్రశ్నించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మారి వేరే ప్రభుత్వం రావాలన్నారు. యూపీ నుంచి వచ్చినాయన కూడా తమను విమర్శించేవారేనని చెప్పారు. నాన్ బీజేపీ రాష్ట్రాల్లోనే తలసరి ఆదాయం ఎక్కువ ఉందన్నారు. బీజేపీ రాష్ట్రాల్లోనే తలసరి ఆదాయం తక్కువగా ఉందని, ఢిల్లీ ఇంజిన్ మారాలని కేసీఆర్ కోరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దించుతామని చెప్పారు.
ప్రజలు బయటకు రావద్దు...
వచ్చే మూడు రోజులు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అన్ని విద్యాసంస్థలు మూసి వేయాలని ఆయన కోరారు. కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడరు. సచివాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, అన్ని శాఖలను అప్రమత్తం చేశామని కేసీఆర్ తెలిపారు. ఎస్సారెస్పీ రాత్రికి నిండిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు. ఎస్సారెస్పీకి 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుందన్నారు. ప్రజలు బయటకు రాకుండా ఉండాలని కేసీఆర్ సూచించారు
Next Story