Fri Nov 15 2024 09:32:19 GMT+0000 (Coordinated Universal Time)
ఏమో ఎవరు చూసొచ్చారు... లక్ ఎలా ఉంటుందో?
కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని 2001లో పెట్టారు. అంటే రెండు దశాబ్దాలు దాటిపోయింది. ఎప్పుడూ ఆయనకు జాతీయ పార్టీ ఆలోచన రాలేదు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ఆలోచన ఎందుకు చేశారు? తెలంగాణలో కంఫర్ట్‌గా ఉన్న కేసీఆర్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సమయంలోనే ఈ స్టెప్ ఎందుకు వేశారు? జాతీయ రాజకీయాల్లో రాణించగలరనుకుంటున్నారా? ఆయన కాన్ఫిడెన్స్ కు కారణాలేంటి? కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని 2001లో పెట్టారు. అంటే రెండు దశాబ్దాలు దాటిపోయింది. ఎప్పుడూ ఆయనకు ఈ ఆలోచన రాలేదు. కేవలం టీఆర్ఎస్ ను రాష్ట్రంలో బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టారు. ఆయన అనుకున్నట్లుగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత రెండు సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చారు.
రెండు దశాబ్దాలు....
ఈ ఇరవై ఏళ్లు ఆయన టీఆర్ఎస్ ను ఒంటిచేత్తో నడిపించారు. ఆయన చెప్పిందే వేదం. ఆయన చేసిందే శాసనం అన్నట్లుగా పాలన సాగింది. మంత్రులను బర్త్‌రఫ్ చేసినా, మంత్రివర్గం నుంచి సీనియర్ నేతలను తప్పించినా, టీడీపీ నుంచి వచ్చిన వారికే మంత్రి వర్గంలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు వచ్చినా ఆయన ఎక్కడా తడబడలేదు. తగ్గలేదు. తొలి సారి రాజయ్య ను మంత్రి వర్గం నుంచి బర్త్‌రఫ్ చేస్తే, రెండోసారి ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి తొలగించారు. ఎస్సీ అయినా, బీసీ అయినా మంత్రి వర్గం నుంచి తొలగించడానికి ఆయన వెనకాడలేదు. రాజకీయ విమర్శలకు భయపడింది లేదు.
ఇతరుల మాదిరిగా...
అయితే ఇప్పటి వరకూ కేసీఆర్ అరవింద్ కేజ్రీవాల్ లాగా పార్టీని పెట్టి ఇతర రాష్ట్రాల్లో పోట ీచేసింది లేదు. మమత బెనర్జీ తరహాలో మూడుసార్లు విజయం రాష్ట్రంలో విజయం సాధించలేదు. జాతీయ రాజకీయాలపై దృష్టి సారించింది లేదు. ఎప్పుడూ ఆయన ఢిల్లీ రాజకీయాల గురించి ఆలోచించలేదు. కానీ ఉన్నట్లుండి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడానికి కారణం ఏమైఉంటుందన్న సందేహాలు ప్రతి ఒక్కరికి కలుగుతున్నాయి. కుమారుడు కేటీఆర్ కు రాష్ట్ర పగ్గాలు అప్పగించి తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నా పార్టీ పెట్టాల్సిన పనిలేదు. ఉన్న కూటముల్లో ఎందులో ఒక దానిలో చేరి తాను కేంద్రమంత్రిగానో, ఎంపీగానో ఢిల్లీలో రాజకీయాలు నడపవచ్చు. అదీ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు ఈ నిర్ణయం తీసుకోవడంపైనా చర్చ జరుగుతుంది.
సీరియస్ గానే...
కానీ కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారు. దసరా రోజున ప్రకటించబోతున్నారు. సీరియస్ గానే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో ఎనిమిదేళ్ల నుంచి పాలన చేస్తుండటంతో కొంత విసుగు చెందారంటారు స్వపక్ష నేతలు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసి తాను తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని కేసీఆర్ భావిస్తున్నారంటారు. ఎంతకాలం ఇలా రాష్ట్రానికి పరిమితమయి ఉంటామన్న ఆలోచనే ఆయనను జాతీయ రాజకీయాల వైపు అడుగులు పడేట్లు చేసిందంటారు. అంతేకాదు బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా ఎదగగలిగితే తెలంగాణకే కాదు దేశంలోనే కేసీఆర్ పేరు మారుమోగుతుంది. కీర్తి., పేరు ప్రతిష్టల కోసమే కేసీఆర్ ఈ టచ్ ఇస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నారు. మోదీ గుజరాత్ నుంచి ప్రధానిగా కాగలిగింది.. తాను ఎందుకు కాలేనన్న ధీమాలో ఆయన ఉన్నారని సన్నిహితులు అంటున్నారు. విమర్శకులు మాత్రం ఇక్కడ ఈసారి పరిస్థిితి కష్టమై డైవర్ట్ చేయడానికే నేషనల్ పార్టీ ఆలోచన చేస్తున్నవారనే వారు లేకపోలేదు. అయితే దక్షిణాదికి చెందిన.. అందునా మన రాష్ట్రానికి చెందిన ఒకరు జాతీయ పార్టీ పెడుతుంటే ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిందే. ఎమో ఎవరు చూడచ్చారు. కేసీఆర్ అదృష్టం ఎలా ఉందో మరి.
Next Story