Tue Nov 26 2024 22:19:42 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ బీఆర్ఎస్.. అందుకేనట
బీఆర్ఎస్ ఏర్పాటు వెనక కేసీఆర్ ఆలోచన వేరుగా ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించడమే లక్ష్యమంటున్నారు
గుజరాత్ లో మోదీ ఎలా గెలిచారు. అక్కడ అభివృద్ధి మాట అటుంచితే ప్రధాని నరేంద్ర మోదీకి అవమానం జరగకూడదని ఏడోసారి అక్కడి ప్రజలు పట్టం కట్టారు. సొంత రాష్ట్రంలో బీజేపీ ఓడిపోతే మోదీ ప్రతిష్ట, అంతర్జాతీయంగా దేశీయంగా మసకబారుతుందని భావించారు. అందుకే గుజరాతీలు కమలం పార్టీ వైపు మొగ్గు చూపారు. ఇక తెలంగాణలోనూ అదే సెంటిమెంట్ రానుందా? అంటే అవుననే అంటున్నారు. శాసనసభ ఎన్నికల వరకూ కేసీఆర్ తనకు ఎదురు లేదని భావిస్తున్నారు. పెద్దగా తనకు కాంగ్రెస్, బీజేపీ నుంచి ముప్పు లేదని భావిస్తున్నారు.
పార్లమెంటు ఎన్నికలకు...
కానీ పార్లమెంటు ఎన్నికలకు వచ్చే సరికి తెలంగాణ ప్రజలు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. గత ఎన్నికల్లో ఇది స్పష్టమయింది. 2018 శాసనసభ ఎన్నికల్లో ఒక్క సీటుతో సరిపెట్టుకున్న బీజేపీకి ఏడాది తిరగక ముందే నాలుగు లోక్ సభ స్థానలను కట్టబెట్టారు. కాంగ్రెస్ మూడు పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించారు. ఢిల్లీలో పట్టు సాధించి రాష్ట్ర ప్రయోజనాలను సాధించాలంటే ఎక్కువ మంది పార్లమెంటు సభ్యులు అవసరమవుతారు. కానీ ఇక్కడ లోక్ సభ ఎన్నికలకు వచ్చే సరికి ప్రజల మూడ్ మారుతుంది. బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు.
శాసనభ ఎన్నికలకు...
అందుకే బీఆర్ఎస్ పేరుతో వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ కు శాసనసభ ఎన్నికల్లో పెద్దగా ఇబ్బంది ఉండదని కేసీఆర్ లెక్కలు వేసుకుంటున్నారు. బీజేపీ శాసనసభ ఎన్నికల్లో ప్రభావం చూపలేదని భావిస్తున్నారు. కమలం పార్టీకి దాదాపు 70 నియోజకవర్గాల్లో సరైన నేతలేరని, క్యాడర్ లేదని, వ్యవస్థ లేదని గులాబీ బాస్ కు తెలుసునంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా వెనకబడి ఉందని, వచ్చే ఎన్నికల్లో తమకు పోటీ ఇచ్చే అవకాశం లేదన్న అంచానాలో ఉన్నారు. అందుకే శాసనసభ ఎన్నికల్లో తిరిగి తమదే గెలుపు ఖాయమని ఆయన ధీమాతో ఉన్నారు.
పట్టు సాధించేందుకేనా?
ఎటొచ్చీ...పార్లమెంటు ఎన్నికలే. పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ప్రజలు టీఆర్ఎస్ వైపు చూడటం లేదు. దానికి కారణం అనేకం కావచ్చు. శాసనసభలో కేసీఆర్ కు అవకాశమిచ్చాం కాబట్టి, పార్లమెంటు ఎన్నికల్లో మరొకరికి ఛాన్స్ ఇద్దామన్న జనం ఆలోచనల్లో మార్పు చేయడానికి బీఆర్ఎస్ ను తెరమీదకు తీసుకొచ్చారంటున్నారు. తెలంగాణ నేతకు దేశ స్థాయిలో పేరు ప్రతిష్ట మరింత పెరగాలంటే పార్లమెంటు ఎన్నికల్లోనూ కారు గుర్తుకే ఓటేయ్యాలన్న ప్రజల మూడ్ ను మార్చేందుకే కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో ముందుకు వస్తున్నారని కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. సీట్లు పెరిగితే కొంత కేంద్రంలో పట్టుసాధించే అవకాశముంది. పార్లమెంటు ఎన్నికల్లో మరి కేసీఆర్ ఊహించిన విధంగా ఈసారి సీట్లు పెరుగుతాయా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story