Mon Dec 23 2024 12:37:15 GMT+0000 (Coordinated Universal Time)
కేఈ ఫ్యామిలీ గతేంటి? ఒంటరి అయిందా?
బీసీ నేతగా ఎదిగిన కేఈ కృష్ణమూర్తి రాజకీయాల నుంచి తప్పుకోవడంతో ఆయన కుటుంబం టీడీపీలో ఒంటరి అయిందనే చెప్పాలి.
తెలుగుదేశం పార్టీలో క్షేత్రస్థాయిలో ఊపు వచ్చింది. కార్యకర్తల్లో జోష్ పెరిగింది. ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామని కిందిస్థాయి కార్యకర్తలు చెబుతున్నారు. కానీ నేతలు మాత్రం ఇంకా ముందుకు రావడం లేదు. అందులోనూ ముఖ్యమైన నేతలు మౌనంగా ఉండటం పార్టీని ఇబ్బందుల్లో పడేస్తుంది. కర్నూలు జిల్లాల్లో ఫ్యాక్షన్ కు పెట్టింది పేరు. దశాబ్దాలుగా ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తున్నాయి. గ్రూపులు గోల ఎక్కువగానే ఉంది. ప్రధాన రాజకీయ కుటుంబాలు పార్టీని బలోపేతం చేసేందుకు ముందుకు రావడం లేదు. బీసీ నేతగా ఎదిగిన కేఈ కృష్ణమూర్తి రాజకీయాల నుంచి తప్పుకోవడంతో ఆయన కుటుంబం టీడీపీలో ఒంటరి అయిందనే చెప్పాలి. ఎవరూ వారిని పట్టించుకోవడం లేదు.
దశాబ్దాల నుంచి....
కేఈ కుటుంబం గత కొన్ని దశాబ్దాలుగా కర్నూలు జిల్లాలో రాజకీయం చేస్తూ వచ్చింది. ప్రత్తికొండ, డోన్ నియోజకవర్గాల్లో కేఈ కుటుంబం పోటీ చేస్తూ వస్తుంది. 2014 ఎన్నికల వరకూ ప్రత్తికొండ నుంచి కేఈ కృష్ణమూర్తి పోటీ చేసే వారు. టీడీపీకి బలమైన నియోజకవర్గం. ఇప్పటికి ఏడుసార్లు టీడీపీ విజయం సాధించింది. డోన్ లోనూ టీడీపీకి మంచి పట్టుంది. అక్కడ కూడా కేఈ కుటుంబం నుంచి కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్ ఏడుసార్లు విజయం సాధించారు. అయితే ఈసారి డోన్ నియోజకవర్గం కేఈ కుటుంబాన్ని చంద్రబాబు దూరం చేశారు.
డోన్ ఇన్ ఛార్జి పదవిని....
డోన్ టీడీపీ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డిని చంద్రబాబు ప్రకటించారు. ఇది రాష్ట్రంలో తొలి ప్రకటన. ఈసారి సుబ్బారెడ్డికే టిక్కెట్ ఇస్తున్నట్లు ఆయన తేల్చారు. ఇది కేఈ కుటుంబానికి రుచించడం లేదు. తమ కుటుంబాన్ని డోన నుంచి దూరం చేసే కుట్ర జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. కేఈ ప్రతాప్ తాను ఈసారి డోన్ నుంచి పోటీ చేయనని ప్రకటించినా కేఈ ప్రభాకర్ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. డోన్ లో కేఈ కుటుంబానికి పట్టుంది. ప్రత్యేకమైన ఓటు బ్యాంకు ఉంది. అలాంటి చో ధర్మవరం సుబ్బారెడ్డికి టిక్కెట్ కన్ఫర్మ్ చూస్తూ చంద్రబాబు చేసిన ప్రకటన కేఈ కుటుంబానికి మింగుడు పడటం లేదు.
ఆలూరులో కేఈ...
దీంతో కేఈ ప్రభాకర్ ఆలూరులో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆలూరులోనూ కేఈ కుటుంబానికి బలమైన వర్గముంది. మరో వైపు ఇదే నియోజకవర్గంలో కోట్ల సుజాతమ్మతో పాటు మాజీ ఎమ్మెల్యే వీరభద్రగౌడ్ వర్గాలు కూడా బలంగా ఉన్నాయి. ఆలూరు లో కోట్ల సుజాతమ్మ పార్టీ కార్కక్రమాలను నిర్వహిస్తున్నారు. వరసగా ఇక్కడ రెండు సార్లు టీడీపీ ఓటమి పాలవుతుంది. ఒకసారి వీరభద్రగౌడ్, మరోసారి సుజాతమ్మ పోటీ చేసి వైసీపీ అభ్యర్థి గుమ్మనూరి జయరాం చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కేఈ ప్రభాకర్ కోరుతున్నారు. ఎటూ ప్రత్తికొండ కేఈ శ్యాంబాబుకు కేటాయిస్తారు. తనకు ఆలూరు ఇవ్వాలని ఆయన గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. కానీ పెద్దాయన నుంచి ఎటువంటి హామీ లభించడం లేదు. దీంతో కేఈ కుటుంబం మనస్తాపానికి గురయిందని చెబుతున్నారు. తనను ఆలూరు నియోజకవర్గ ఇన్ ఛార్జి చేయాలని కేఈ ప్రభాకర్ పట్టుబడుతున్నారు. దీనికి అధిష్టానం ఎటువంటి సంకేతాలు ఇవ్వకపోవడంతో కేఈ కుటుంబం గుర్రగా ఉంది. కిమ్మనకుండా ఉన్నా ఎన్నికల నాటికి బరస్ట్ అయ్యే అవకాశాలున్నాయి.
Next Story