Mon Dec 23 2024 07:47:35 GMT+0000 (Coordinated Universal Time)
కేశినేని బౌన్సర్లు ఇంకా ఉన్నాయా?
కేశినేని నాని టీడీపీకి శత్రువుగా మారుతున్నారు. టీడీపీని ఇరుకున పెట్టేలా కామెంట్స్ చేసేందుకు సిద్ధమవుతున్నారు
నిజమే.. అనుకుంటున్నట్లే జరుగుతుంది. టీడీపీ నుంచి బయటకు వచ్చేందుకు ఎంపీ కేశినేని నాని సిద్ధమవుతున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పదలచుకున్న నేపథ్యంలో కేశినేని నాని భవిష్యత్ లోనూ టీడీపీని టార్గెట్ గా చేసుకుని సంచలన వ్యాఖ్యాలు చేయక మానరు. నాని రానున్న కాలంలో టీడీపీకి తలనొప్పిగా మారనున్నారన్నది యదార్థం. కేశినేని నాని ఎవరికీ బెదరడు. లొంగడు. తాను అనుకున్నది అనుకున్నట్లు చెప్పే రకం. మోటారు ఫీల్డ్ నుంచి రావడంతో మొరటుగా మాట్లాడతారని ఆయన సన్నిహితులే వ్యాఖ్యానిస్తారు.
టీడీపీకి శత్రువుగా...
అలాంటి కేశినేని నాని ఇప్పడు టీడీపీకి క్రమంగా శత్రువుగా మారుతున్నారు. ఆయన టీడీపీని ఇరుకున పెట్టేలా కామెంట్స్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లే కనిపిస్తుంది. ఢిల్లీలో ఆఫ్ ది రికార్డుగా కేశినేని నాని మాట్లాడినా అది బహిరంగంగానే ఆయన మాట్లాడే అవకాశాలు లేకపోలేదు. చంద్రబాబుకు పార్టీని గెలిపించే శక్తి, సత్తా లేదన్నది కేశినేని నాని అంటున్న మాట. చంద్రబాబు ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వారి మాటలను నమ్మరని, బ్రోకర్లు, లోఫర్లు చెప్పే మాటలే వింటారని కేశినేని నాని ఘాటు వ్యాఖ్యలు చేయడం వెనక ఆయన మనసులో ఎంత పార్టీ అధినేతపై ఆగ్రహంతో రగిలిపోతున్నారో ఇట్టే అర్ధమవుతుంది.
తన మాట చెల్లుబాటు కాకుండా...
ఒక పార్లమెంటు సభ్యుడిగా తన నియోజకవర్గంలో తన మాట చెల్లుబాటు కాకుండా పోయిందన్న బాధలో కేశినేని నాని ఉన్నారు. ముఖ్యంగా బోండా ఉమ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వడంపైనా కేశినేని నాని రగిలిపోతున్నారు. ఎంపీగా రెండో సారి గెలిచిన తనను కాదని గెలవలేని నేతల మాటలను చంద్రబాబు విన్నుంటారన్నది నాని భావన. తన కుమార్తెకు మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ నేతలు ఎవరూ తనకు సహకారం అందించలేదని సాక్షాధారాలతో చెప్పినా చంద్రబాబు చర్యలు తీసుకోకపోవడంపై నాని ఆగ్రహంతో ఉన్నారు.
హైకమాండ్ పై...
ఇక కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్నిని అధినాయకత్వం ప్రోత్సహిస్తుండటంపై కూడా గుర్రుగా ఉన్నారు. తన ప్లేస్ లో సోదరుడిని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానం ఉంది. అందుకే నాని ఈ మధ్య ఫైర్ అవుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు. నాని రాజకీయాలు గుడ్ బై చెప్పడం ఖాయం. అదే సమయంలో టీడీపీలో జరుగుతున్న పరిణామాలను కూడా వివరించి వెళతారన్నది ఆయన సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం. అదే జరిగితే ఎన్నికల సమయంలో సొంత సామాజికవర్గానకి చెందిన కేశినేని నాని చంద్రబాబుకు రాజకీయ ఇబ్బందులు తెచ్చి పెట్టే అవకాశాలయితే కన్పిస్తున్నాయి. నాని ఊరికే వదలి వెళ్లే రకం కాదు. తానేంటో చూపించి రాజకీయాల నుంచి తప్పుకుంటారన్నది ఆయనను దగ్గర నుంచి చూసిన వాళ్లు అంటున్న కామెంట్. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Next Story