రేవంత్ కు కీలక పదవి..?
తెలంగాణలో ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం అలర్ట్ అయ్యింది. రాహుల్ గాంధీ పిలుపుమేరకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలు హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో అధిష్ఠానం యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పీసీసీ కార్యావర్గంతో పాటు అనుబంధ సంఘాల కమిటీల నియామకం కూడా పూర్తి చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే ఈ కమిటీల ఏర్పాటు పూర్తిచేయనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ప్రకటించారు.
ప్రచార కమిటీ అధ్యక్షుడిగా...
ఇక ఎన్నికల నేపథ్యంలో చురుగ్గా ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహాన్ని అనుసరించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రచార కమిటీ, మ్యానెఫెస్టో కమిటీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేతల్లో ప్రముఖంగా కనపడుతున్న రేవంత్ రెడ్డిని ప్రచార కమిటీ అధ్యక్షుడిగా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇక మ్యానిఫెస్టో కమిటీ అధ్యక్షుడిగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మను, పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ గా బీసీ సామాజికవర్గానికి చెందిన కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ను నియమించేలా కనపిస్తోంది. సామాజిక సమీకరణాలతో పాటు టీఆర్ఎస్ ను ఎదుర్కోగలరనే ఉద్దేశ్యంతో వీరి పేర్లు అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
అసంతృప్త జ్వాలలు రేగుతాయా..?
ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ లో చేపడుతున్న నియామకాలు ఇతర కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తిని లేవనెత్తేలా కనిపిస్తోంది. కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డికి ప్రచార కమిటీ వంటి ముఖ్య బాధ్యతను అప్పగిస్తే ఇతర సీనియర్ నేతలు, మహబూబ్ నగర్ జిల్లా నేతలు అలకపాన్పు ఎక్కే అవకాశం ఉంది. ఇక పీసీసీ అధ్యక్షుడిని అలాగే కొనసాగించి దళిత సామాజికవర్గానికి చెందిన భట్టి విక్రమార్కను వర్కింగ్ ప్రసిడెంట్ పదవి నుంచి పక్కకు తప్పిస్తే ఆ వర్గం నేతల్లో అసంతృప్తి రేగే అవకాశం ఉంది. ఇక పార్టీలో కీలకంగా మారాలని భావిస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్, డీకే అరుణ వంటి వారికి ప్రాధాన్యత లేకపోతే వారు కూడా ఎన్నికల వేళ పార్టీకి తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రచార కమిటీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా పదవి రాకపోతే కీలక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వేల తలనొప్పులు తప్పేలా లేవు.