Mon Nov 18 2024 08:52:02 GMT+0000 (Coordinated Universal Time)
బై బై గణేశా.. ముగిసిన ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయింది. వేలాది మంది భక్తులు వీక్షిస్తుండగా నిమజ్జనాన్ని ముగించారు.
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయింది. వేలాది మంది భక్తులు వీక్షిస్తుండగా నిమజ్జనాన్ని ముగించారు. దాదాపు ఐదు గంటల పాటు ప్రయాణించి ఖైరతాబాద్ గణేశుడు ట్యాంక్ బండ్ కు చేరుకున్నారు. క్రేన్ నెంబర్ 4వద్ద ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరిగింది. క్రేన్ నెంబర్ 4 వద్దకు ప్రజలను ఎవరినీ రానివ్వలేదు. దూరం నుంచే నిమజ్జనం ప్రక్రియ చూడాలని పోలీసులు బ్యారికేడ్లు నిర్మించారు. ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకున్న ఖైరతాబాద్ గణేష్ కు తొలుత పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం విగ్రహానికి ఉన్న ఇనుపచువ్వలను వెల్డింగ్ పనుల ద్వారా తొలగించారు.
వేల సంఖ్యలో పరిశీలించేదుకు...
నిమజ్జనం పరిశీలించేందుకు వేల సంఖ్యలో ట్యాంక్‌బండ్ కు చేరుకున్నారు. హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల నుంచి ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం నిమజ్జనం చూసేందుకు తరలి రావడంతో ట్యాంక్ బండ్ ప్రాంతం కోలాహలంగా మారింది. వర్షం కురిసినా ప్రజలు ట్యాంక్‌బండ్ పైనే గణేష్ నిమజ్జనం చూసేందుకు నిలబడి ఓపిగ్గా వేచి చూశారు. పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లోకి వినాయక విగ్రహాలు మినహా మరే వాహనాలను అనుమతించ లేదు. నిమజ్జనం ముగిసిన తర్వాత ఖైరతాబాద్ వైపునకు భక్తులు వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. మిగిలిన రహదారులు గణపతులతో కిక్కిరిసి పోయినందున ఖైరతాబాద్ వైపు మాత్రమే వెళ్లాలని పోలీసులు భక్తులను కోరుతున్నారు. ప్రశాంతంగా నిమజ్జనం ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story