కిడారి హత్యలో కొత్త కోణం?
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమలను చంపేస్తామని తాము ఊహించలేదని, మావోయిస్టులు బెదిరించి వదిలేస్తారని మాత్రమే తాము కిడారి సమాచారం ఇచ్చారని పోలీసులు అదుపులో ఉన్న నిందితులు చెప్పినట్లు తెలిసింది. కిడారి హత్య కేసులో మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి కాల్ డేటా ఆధారంగా ఎవరెవరితో ఎప్పుడు మాట్లాడారన్న సమాచారాన్ని సేకరిస్తున్నారు. కిడారిని మావోయిస్టుల ఉచ్చులోకి లాగింది స్థానికంగా ఆయనతో సన్నిహితంగా ఉన్నవారేనని తేలింది.
కొందరు కన్పించకపోవడంతో....
కిడారి హత్య జరిగిన తర్వాత కొందరు ఆయన సన్నిహితులు కన్పించకుండా పోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన జిల్లా ఉపాధ్యక్షుడితో పాటు ఆయన అనుచరులు కూడా కన్పించకపోవడంతో వారి బంధువులను స్టేషన్ కు పిలిపించి విచారిస్తున్నారు. కిడారి రాకపోకలపై ప్రధానంగా సమాచారం మావోయిస్టులకు ఇచ్చారని అనుమానిస్తున్న మాజీ ఎంపీటీసీ సుబ్బారావు, మాజీ ఎంపీపీ ధనీరావు, కొండబాబులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
సొమ్ముల కోసమే అనుకున్నామని.....
అయితే విచారణ సందర్భంగా వీరు ఆసక్తి కరమైన విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. కిడారి నుంచి సొమ్ములు వసూలు చేయడానికే తాము ఆయన సమాచారాన్ని కోరుతున్నామని మావోయిస్టులు వీరికి చెప్పినట్లు తెలిసింది. కిడారి పలు మైనింగ్ కాంట్రాక్టులలో బాగా సంపాదించారని, అందుకే ఆయన నుంచి తాము విరాళాలు సేకరిస్తామని వీరికి నమ్మకంగా చెప్పడంతో వారు కిడారి సమాచారాన్ని ఇచ్చినట్లు విచారణలో అంగీకరించారు.
ప్లాన్ జరిగింది ఎలా?
ఎప్పటి నుంచి కిడారి హత్యపై ప్లాన్ జరిగిందని...అందుకు ఎవరెవరు సహకరించారో పోలీసులు పక్కా ఆధారాలతో సమాచారాన్ని సేకరిస్తున్నారు. వీరిలో కొందరు తాము మావోయిస్టులకు సహకరించామని చెప్పగా, మరికొందరు మాత్రం మావోయిస్టులు చంపేస్తారని తాము ఊహించలేదని, బెదిరించి వదిలేస్తారని అనుకున్నామని తెలిపారు. హత్య జరిగిన తర్వాత డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ పై దాడి ఘటన వెనక కూడా కొందరి హస్తం ఉందని గుర్తించారు. మొత్తం మీద కిడారి హత్యలో రోజురోజుకూ కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి.