Thu Dec 19 2024 16:33:05 GMT+0000 (Coordinated Universal Time)
రాజగోపాల్ రెడ్డి రిస్క్ తీసుకుంటున్నారా?
మునుగోడు ఉపఎన్నిక దాదాపు ఖారరయింది. ఈ నెల 8వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు
మునుగోడు ఉప ఎన్నిక దాదాపు ఖారరయింది. ఈ నెల 8వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. ఆరు నెలల్లో ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే కోమటిరెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఆయనే అభ్యర్థి కానున్నారు. ఉప ఎన్నికల్లో గెలవడం అంత సులువు కాదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రిస్క్ తీసుకున్నారా? అన్న సందేహం కూడా ఆయన సన్నిహితుల్లో వ్యక్తమవుతుంది. రాజకీయాల్లో రిస్క్ సాధారణమే కాని, ఇంకా ఒకటిన్నర సంవత్సరం ఉన్న పదవిని అనవసరంగా వదులుకుంటారా? అన్న చర్చ జరుగుతుంది.
బీజేపీకి ఇక్కడ...
మునుగోడు రాజకీయ పరిస్థితులు వేరు. అక్కడ తొలి నుంచి కాంగ్రెస్, కమ్యునిస్టుల బలంగా ఉన్నాయి. బీజేపీకి ఇక్కడ చోటే లేదు. కులాల పరంగా చూసినా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఇబ్బందేనని చెప్పాలి. మునుగోడులో రెడ్డి సామాజిక వర్గం చాలా తక్కువ. మొత్తం ఓటర్లలో కేవలం 3.49 శాతం మంది మాత్రమే రెడ్డి సామాజికవర్గం ఉంది. ఇక్కడ ఎక్కువగా బీసీలు ఉన్నారు. దాదాపు నలభై శాతం మందికి పైగా బీసీలున్నారు. బీసీ సామాజికవర్గం ఏ పార్టీకి మద్దతిస్తే వారిదే గెలుపు అవుతుంది. అయితే బీసీలలో ఐక్యత ఎంత వరకూ సాధ్యమవుతుందన్నది మాత్రం చెప్పలేని పరిస్థితి.
ట్రయాంగల్ ఫైట్...
ఇక మునుగోడులో ఈసారి ట్రయాంగల్ ఫైట్ తప్పదు. టీఆర్ఎస్ ఇక్కడ బలంగా ఉందనే చెప్పాలి. కాంగ్రెస్ కు స్పష్టమైన ఓటు బ్యాంకు ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో సాలిడ్ గా ఓటు బ్యాంకు అంతా బీజేపీ వైపు మళ్లుతుందని చెప్పలేం. కొంతమంది నేతలు వెళ్లొచ్చు. నేతలు వెళ్లినంత మాత్రాన ఓటర్లు గంపగుత్తగా వారి వెంట వెళతారన్నది ఖచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అంతా ప్రభుత్వ వ్యతిరేకత ఓటు పైనే ఆధారపడి రంగంలోకి దిగుతున్నట్లు కనపడుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చితే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రిస్క్ లో పడక తప్పదు అన్నది విశ్లేషకుల అంచనా.
ఎక్కువ ఓట్లు చీలిస్తే....
కాంగ్రెస్ ను కూడా తక్కువగా అంచనా వేయలేం. సరైన అభ్యర్థిని రంగంలోకి దించితే కాంగ్రెస్ గెలవలేక పోయినా మరొకరిరిన ఓడించే స్థాయిలో ఓట్లను చీల్చుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం తాను గెలవలేకపోయినా కోమటిరెడ్డిని ఓడించాలన్న పట్టుదలతో ఉన్నట్లే కనిపిస్తుంది. అదే జరిగితే టీఆర్ఎస్ కు ఇక్కడ లాభం చేకూరుతుంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడంతో ఆ నియోజకవర్గంలో టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న ఓట్లు సయితం కాంగ్రెస్ దక్కించుకునే వీలుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి రిస్క్ తీసుకున్నారని, హుజూరాబాద్ లా ఇది వన్ సైడ్ లా ఉండదని, ఫలితం వెలువడే వరకూ టెన్షన్ తప్పదన్న కామెంట్లు వినపడుతున్నాయి.
Next Story