దెబ్బకు అక్కడ రియల్ ఎస్టేట్ పెరిగిపోయిందే...?
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందంగా ఎప్పుడు ఏ అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూ వుంటారు రియల్టర్లు. నోట్ల రద్దు, జీఎస్టీ తరువాత దేశమంతా రియల్ ఎస్టేట్ బిజినెస్ గతం ఒక తీపి జ్ఞాపకం. ప్రస్తుతం చేదు అనుభవాలు అన్నట్లు మారిపోయింది. తాజాగా ఇప్పుడు భాగ్యనగర్ లో వారికి టీఆర్ఎస్ సభ రూపంలో చక్కటి ఛాన్స్ లభించింది. ఔటర్ రింగ్ రోడ్డులో బంజరభూముల ధరలకు రెక్కలు వచ్చేశాయి. అదేమిటి అంటే అంతే మరి.
కొంగర కలాన్ అదృష్టం అందించింది ...
కొంగర కలాన్ ప్రాంతంలోని దాదాపు రెండువేల ఎకరాల బీడు భూమిని చక్కగా చదును చేసి చారిత్రక సభకు వేదికగా మార్చింది గులాబీ పార్టీ. అక్కడకు వెళ్ళెందుకు 19 ప్రాంతాల నుంచి కనెక్టివిటీ కల్పించింది. ముఖ్యంగా ఔటర్ నుంచి అయితే 9 ప్రాంతాలనుంచి కొంగర కలాన్ కు చేరుకోవొచ్చు. ఒకప్పుడు ఎందుకు పనికిరాని భూమిగా వున్న ఆ ప్రాంతం సర్వాంగ సుందరంగా ముస్తాబు అయ్యింది. ఇంత చక్కటి కనెక్టివిటీ, రోడ్లు ఏర్పడ్డాకా రియల్టర్లు చూస్తూ ఊరుకుంటారా ? బరిలోకి దిగిపోయారు.
ఈ భూమి ఇక బంగారం అంటూ.....
రాబోయే రోజుల్లో కొంగర కలాన్ అనేక కంపెనీలు జనావాస ప్రాంతాలకు స్వర్గ ధామంగా టి సర్కార్ మార్చబోతుందన్న ప్రచారం మొదలు పెట్టేశారు రియల్టర్లు. దాంతో ఇంకేముంది గజం 10 వేలరూపాయల నుంచి 15 వేలరూపాయలు ప్రస్తుతం ధరపలికేసింది. ఎకరం ఇప్పుడు ఐదుకోట్ల రూపాయలు పలుకుతుంది. చాలా తక్కువ ప్లాట్ లు వున్నాయంటూ అందరిని ఆకర్షిస్తున్నారు రియల్ ఎస్టేట్ పనిమంతులు. టీఆర్ఎస్ సభ పుణ్యమాంటూ వీరంతా ఇప్పుడు నాలుగు రూకలు వెనకేసే పనిలో చాలా బిజీగా ఉండటం విశేషం.